Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అమోయ్ కుమార్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయి పర్యటనలు ముగింపుపై సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ నిర్వహించారు. శనివారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఛాంబర్లో సివిల్ సర్వీస్ అధికారుల ఫౌండేషన్ కోర్స్ ముగింపు సమావేశం నిర్వహించారు. 14 మంది సివిల్ సర్వీస్ అధికారులు అక్టోబర్ 31వ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు యాచారం మండలంలోని గున్గల్, కొత్తూరు మండలంలోని పెంజర్ల, మంచాల్ మండలంలోని ఆరుట్ల గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అధ్యయనం, ప్రజల జీవన విధానం వంటి అంశాలను సివిల్ సర్వీస్ అధికారులు ఫౌండేషన్ కోర్స్ కింద పరిశీలన నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు ఆయా అధికారులు గ్రూపులుగా గ్రామాల్లో బస చేసి అధ్యయనం చేసిన అంశాలపై పరిశీలనలు, ప్రజల అభిప్రాయాలు, కావల్సిన సౌకర్యాలు వంటివి కలెక్టర్కు వివరించారు. జిల్లాలో వ్యవసాయం, రైతుబంధు, మిషన్ భగీరథ, ఆరోగ్యం, హరిత హారం, పల్లె ప్రగతి, అంగన్వాడీల పనితీరు వంటి అంశాలపై వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్య క్రమం భాగంగా జిల్లాలో మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న 558 గ్రామ పంచాయతీల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, క్రీడాకారులకు అందు బాటులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, పీడీ డీఆర్డీఎ ప్రభాకర్, కొత్తూరు ఎంపీడీఓ శరత్ చంద్రబాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.