Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం హామీల ప్రకటనపై ఆశగా చూస్తున్న జిల్లా ప్రజలు
- జిల్లాలో ఇటీవల ఇండ్ల జాగాలపై తీవ్రపోరు
- సీఎం మాట కోసం 20వేల మంది లబ్దిదారుల ఎదురుచూపు
- సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపేనా?
- సీఎం స్పీచ్‌పై సర్వత్రా ఉత్కంఠ
- నేడు మెట్రో రెండో దశ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
- అనంతరం భారీ బహిరంగ సభ
- జన సమీకరణే టార్గెట్‌గా ఎమ్మెల్యేలు
- సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు
- సీఎం సభను విజయవంతం చేయాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపు
సీఎం కేసీఆర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వరాల జల్లులు కురిపిస్తున్నారు. శుక్రవారం మెట్రో రెండో దశ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీఎం స్పీచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టడుతున్నారు. ముఖ్యంగా ఇండ్ల జాగాల కోసం వేలాది మంది ఇటీవల ఉద్యమాలు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ ఏమైనా స్పందిస్తారా అని లబ్దిదారులు ఆశగా చూస్తున్నారు. వీరితోపాటు గతంలో ఇచ్చిన హామీలు, కొత్తగా ఇచ్చే వరాలపై జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2006లో ఇల్లు లేని నిరుపే దలకు నాటి ప్రభుత్వం ఇంటి జాగాలు కేటాయించింది. ఇందులో కొన్ని ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చి.. ఇంటి జాగాలు పంపిణీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చారు. కానీ జాగాలు చూపకపోవడడంతో పట్టా సర్టిఫికేట్లు పట్టుకుని పేదలు, ఇంటి జాగాలు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పట్టాలు వచ్చి ఇంటి జాగాలు రానీ వారు ఉమ్మడి జిల్లాలో సుమారు 20 వేల మంది ఉన్నారు. వీరంతా సీఎం కేసీఆర్ మాట కోసం ఎదురుచూస్తున్నారు. సార్ మా జిల్లాకు వస్తుండు.. మా కష్టాలు తీర్చుతాడని.. ఆశగా ఎదురు చూస్తున్నారు. కేవలం రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమిలోనే సుమారు రెండు వేల మంది పేదలకు పట్టాలు ఇచ్చారు. ఇలా అబ్దులాపూర్‌మెట్, తలకొండపల్లి, చేవెళ్ల, శంకర్పల్లి, తాండురు. వికారాబాద్ ప్రాంతాల్లో వేలా ది మంది నిరుపేదలకు ఇంటి జాగాలకు పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలకు జాగాలు ఇవ్వాలని పేదలు కోరుతున్నారు. అలాగే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. గతంలోనే ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసి ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ అనివార్య కారణాలతో పనులు పూర్తి కాలేదు. ఈ సభలోనైనా వాటిపై సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తారని జిల్లా రైతాంగం ఆశగా ఎదురుచూస్తోంది.
మెట్రో విస్తరణలో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలో మీటర్ల మేరకు రూ. ఆరు వేల 250 కోట్ల నిధులతో చేపట్టనున్నారు. నేడు చేపట్టే రెండవ దశ మెట్రో పనుల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొన్ననున్నారు. అనంతరం పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సీఎం స్పీచ్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున్న జనలను తరలించేందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.
బహిరంగ సభలో జనసమీకరణతో తమ సత్తచాటు కోవడానికి ఎమ్మెల్యేలు పోటబోటిగా తహతహలాడుతు న్నారు. జన సమీకరణే టార్గెట్‌గా ఎమ్మెల్యేలు తమ ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో తరలించేందుకు ఏర్పా ట్లు ము మ్మరం చేశారు. గత సభల కంటే భిన్నంగా సభ ప్రాంగణం కిక్కిరిసి పోయేలా ఉండాలని టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం జిల్లా నాయకత్వానికి సూచించినట్టు గులాబీ శ్రేణులు చెబుతున్నాయి.
ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యేలు
శుక్రవారం నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర నేతలతో కలిసి పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు చేసినట్టు వారు తెలిపారు.
రెండవ దశ మెట్రో జిల్లాకు మణిహారం : మంత్రి సబితాఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లా పరిధిలో రెండవ దశ మెట్రో నిర్మాణం జిల్లాకు మెట్రో మరో మణిహారం కానుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మెట్రో నిర్మాణ పనులు పూర్తియితే ట్రాఫిక్ సమస్యలు, కాలుష్య రహిత ప్రయాణా నికి మార్గం ఏర్పడుతుందన్నారు. జిల్లా ప్రజల తరపున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బహి రంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయ వంతం చేయాలని కోరారు.
మెట్రో ప్రారంభం.. జిల్లా అభివృద్ధికి మైలురాయి : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
రెండవ దశ మెట్రో విస్తరణ పనులు రం గారెడ్డి జిల్లాకు దక్కడం జిల్లా అభివృద్ధికి మెట్రో కలికి తురాయి అని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజలు ఇచ్చే బహుమతి, బహిరంగ సభను విజయవంతం చేయడమేనని ఆయన తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని టీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలు, అభిమానులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ కూడా మైండ్‌స్పేస్ వద్దకు రావద్దని, నేరుగా బహిరంగ సభా స్థలి వద్దకు రావాలని సూచించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంపీ వివరించారు.