Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కె నిఖిల
నవతెలంగాణ- వికారాబాద్ కలెక్టరేట్
జిల్లాలో ప్రయివేటు స్థలాలలో నిర్వహిస్తున్న నర్సరీలు అన్నింటిని ప్రభుత్వ స్థలాలలోకి వారం రోజులలో మార్చాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో హరితహారం నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులు తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రయివేటు స్థలాలలో నిర్వహిస్తున్న నర్సరీలను అన్నింటిని వారం రోజులలో ప్రభుత్వ స్థలాలలో వంద శాంతం షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఈ సారి హరితహారంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు పెంచేందుకు గాను నాణ్యమైన మట్టితో బ్యాక్ ఫీలింగ్ చేపట్టాలని సూచించారు. స్థానికంగా దొరికే నాణ్యమైన విత్తనాలను విత్తి వందశాతం మొక్కలు మొలకెత్తేలా చూడాలన్నారు. ఈ పనులను వారం రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, ఎంపీఓలు, మండల స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలని కోరారు. నర్సరీలలో ఉన్న మొక్కలకు ప్రతివారం ట్యాంకుల ద్వారా నీరు తెప్పించి పట్టాలన్నారు. ప్రతి నర్సరీలో మొక్కల వివరాలు తెలిపే రిజిస్టర్లను కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. వన సేవకుల ద్వారా నర్సరీల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించి లక్ష్యం మేరకు నాణ్యమైన మొక్కలను అందించాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలకు సంబంధించిన స్థల సేకరణ పనులను తహసీల్దారుల సహకారంతో చేపట్టి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలలో మొలచిన గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించి అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని గ్రామ పంచాయతీలలో ఎప్పటికప్పుడూ పారిశుధ్య పనులు నిర్వహించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులన్నింటికీ వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలని, పంచాయతీ కార్యాలయాలలో నిర్వహించాల్సిన 32 రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించి, జాబ్ కార్డు వివరాలు అప్డేట్గా ఉండేలా ఎంపీడీవోలు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. జిల్లాలో మొదటి విడతాగా మంజూరైన 'మన ఊరు మన బడి' పనుల ను వేగవంతం చేసి పాఠశాలలను అందంగా తీర్చి దిద్దేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. పనులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, పనులు పూర్తయిన వెంటనే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, డీఆర్డీఓ కృష్ణన్ లతోపాటు మండలాల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.