Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
కంటి చూపుతోనే ప్రపంచాన్ని చూడగలమని, ప్రతి ఒక్కరికి చూపు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు జిల్లా కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని గురువారం కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 580 గ్రామపంచాయతీలు, 97 మున్సిపల్ వార్డులలో కంటి వెలుగు క్యాంపులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు, ప్రతి క్యాంపులో ఎనిమిది మంది వైద్యులు ఉంటారని, జిల్లాలో మొత్తంలో 380 మంది వైద్య సిబ్బంది పాల్గొంటారన్నారు. వంద రోజులపాటు వైద్యాధికారులు పూర్తి శ్రద్ధతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలకు అందించిన స్లిప్పుల ప్రకారం కంటి వెలుగు శిబిరాలకు తరలించి కంటి చికిత్సలు అందించాలన్నారు. అవసరమైన మందులతో పాటు కండ్ల అద్దాలను ప్రజలకు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ వార్డులలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చేలా చూడాలని సూచించారు. రీడింగ్ గ్లాసెస్ వెంటనే అందజేయడం జరుగుతుందని, ప్రెస్క్రిప్షన్ గ్లాసులను 10 నుంచి 15 రోజులు సంబంధిత ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటికి వచ్చి అందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ద్యేయమన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కకూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోని లబ్ది పొందాలన్నారు. కోడంగల్ ప్రభుత్వాస్పత్రిలో డయాలాసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఆస్పత్రులో అభివృద్ధి తోపాటు, పల్లె దవఖానాలను ఏర్పాటు చేసుకొని మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందజేస్తున్నట్టు తెలిపారు.గర్భిణులకు,పిల్లలకు న్యూట్రిషన్ కిడ్స్ అందించడం జరుగుతుందన్నారు. అన్ని గ్రామాలలో, వార్డులలో హెల్త్ సర్వే నిర్వహించి, బిపి, షుగర్ వ్యాదిగ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన మందులను అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, మనం తినే రసాయన ఎరువులతో కూడుకున్న ఆహారపదార్థాల వల్ల కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పాల్వాన్ కుమార్, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, పిఎస్ సిఎస్ చైర్మన్ కటకం శివకుమార్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉషారాణి, మండల ప్రత్యేక అధికారి విమల, డిప్యూటీ వైద్యాధికారి రవీందర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, పాల్గొన్నారు.