Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులు, విధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారామని ఆందోళన
- ఎంపీటీసీల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చిన జడ్పీటీసీ
నవతెలంగాణ-ఆమనగల్
నిధులు, విధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎంపీటీసీలు మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మంగళవారం కడ్తాల్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్, వైస్ ఎంపీపీ బావండ్లపల్లి ఆనంద్, పీఏసీఎస్ చైర్మెన్ గంప వెంకటేష్ గుప్తా హాజరైయ్యారు. ఎంపీడీఓ రామకృష్ణ సభను ప్రారంభించి శాఖల వారిగా సమీక్ష నిర్వహిస్తుండగా అధికార పార్టీతో పాటు విపక్ష సభ్యులు నిధులు విధులు కేటాయించని ఎంపీటీసీ పదవులలో ఉత్సవ విగ్రహాలుగా మారామని, గ్రామస్థాయిలో ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమాల సమాచారాన్ని కూడా అధికారులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సభను బహిష్కరించారు. అనంతరం ఎంపీపీ కమ్లి మోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్‌తో కలిసి ఎంపీటీసీ సభ్యులు లచ్ఛిరామ్ నాయక్, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బొప్పిడి గోపాల్, మంజుల, ఉమావతి, నిర్మల, కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా తదితరులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరి నశించాలంటూ విపక్ష ఎంపీటీసీ సభ్యులు నినాదాలు చేశారు. ఎంపీటీసీలకు నిధులు విధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీటీసీల నిరసనకు జడ్పీటీసీ దశరథ్ నాయక్ సంఘీభావం తెలిపుతూ వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు. ఎంపీటీసీలు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే కొంత మంది సర్పంచులతో ఎంపీడీఓ సమావేశాన్ని నిర్వహి స్తుండగా ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించి బయిటకు వస్తే మళ్ళీ సమావేశం నిర్వహించడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో అక్కడ ఉన్న పలువురు సర్పంచ్‌లు, అధికారులు బయటకు వెళ్లి పోయారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిశంకర్‌గౌడ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.