Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలకు చదువుకు దూరం చేసే కుట్ర
- విద్య రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి
- ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ సభ్యురాలు మమత
నవతెలంగాణ-యాచారం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జాతీయ కమిటీ సభ్యురాలు మమత డిమాండ్ చేశారు. మంగళవారం యాచారం మండల పరిధిలో గున్గల్ మోడల్ స్కూల్లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విద్యా విధానంతో విద్యా రంగంలో ఆర్థిక అసమానతలు చోటు చేసుకుంటాయని తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని విమర్శించారు. ఈ విద్యా విధానం అమలయితే పేద విద్యార్థులకు, మహిళలకు పూర్తిగా విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని వివరించారు. ఈ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం 30శాతం నిధులు కేటాయించాలని, విద్య వ్యవస్థని బలోపేతం చేయడం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కంబాలపల్లి విప్లవ్‌కుమార్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు ఆల్లంపల్లి జంగయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.