Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు వై.స్వప్న
నవతెలంగాణ-మంచాల
మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఏలమొని వై.స్వప్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోనీ కామ్రేడ్ కాచము కృష్ణ మూర్తి భవన్లో మండల కన్వీనర్ పోచమొని కృష్ణ ఆధ్యక్షతన సీఐటీయూ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్నేండ్ల క్రింత కార్మికులు చేసిన పోరాటంతో ప్రభుత్వం రెండు వేల రూపాయల గౌరవ వేతనం పెంచడం సంతోషకరమైన విషయమన్నారు. కానీ రూ.3వేలు వేతనంతో పని చేయాలంటే వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో వంటలు చేసి విద్యార్థులకు భోజనం పెడితే వంట బిల్లులు నెల నెలా సక్రమంగా రాకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సకాలంలో బిల్లులు రాక అప్పులు తెచ్చి పెట్టాల్సి వస్తుందన్నారు. గుడ్లకు మార్కెట్ రేటు కట్టక పోవడంతో వాటికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా బియ్యం సరఫరా చేసిన విధంగానే ,గుడ్లను కూడ సరఫరా చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్మికులకు పీఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు.
సీఐటీయూ మండల కమిటీ ఎన్నిక
సీఐటీయూ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.ఈ కమిటీలో అధ్యక్షురాలిగా సరిత, ఉపాధ్యక్షురాలిగా జీ.అలివేలు, రంగమ్మ, కార్య దర్శిగా స్వప్న, కోషాధికారిగా సంతోషలతో పాటు మరో పది మందిని మండల కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ పోచమొని కృష్ణ, ఇబ్రహీంపట్నం కన్వీనర్ సీహెచ్. బుగ్గ రాములు, నాయకులు అలివేలు, అనసూయ , జంగమ్మ ,అండాలు,ద్వాలి, పద్మ తదితరులు ఉన్నారు.