Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి
- కలెక్టర్ నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి, ఆ ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సంబం ధించిన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్‌లతో కలిసి పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న పారిశుధ్యం, హరితహారం, శ్మశన వాటికలు, బృహత్ పల్లె ప్రకృతి పల్లె వనాలు, జాతీయ ఉపాధి హామీ పనులపై ప్రజాప్రతినిధులు మండల స్థాయి గ్రామస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడు మాసాల్లో ఎన్నికల ప్రక్రియలో పనిచేయాల్సి ఉంటుందనీ, అంతలోపు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి, గ్రామాల్లో ప్రభుత్వ లక్ష్యాలను సులభంగా ప్రజలకు చేరవేసేందుకు కృషి చేయాలన్నారు. మండల స్థాయి కమిటీలు గ్రామస్థాయికి , జిల్లా స్థాయికి అనుసంధాన కర్తగా ఉంటూ పని చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామస్థాయిలో సర్పంచ్, విలేజ్ రెవెన్యూ అధికారి పంచాయతీ కార్యదర్శి కలిసికట్టుగా పని చేస్తేనే పనులు వేగవంతంగా పూర్తవుతాయని తెలిపారు. వివిధ అభివద్ధి పనులు చేపట్టేందుకు జనవరి నుంచి మే వరకు మంచి వాతావరణం ఉంటుందనీ,ఈ సమయంలో రోడ్లు, భవన నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని తెలిపారు. గ్రామాల్లో చిన్న చిన్న పనులను చేసినప్పటికీ ప్రజలు ఎంతగానో గుర్తిస్తారని, వారికి కనీస సౌకర్యాలు కల్పిస్తే, ప్రజా ప్రతినిధులు విజయం సాధించినట్లేనని కలెక్టర్ తెలిపారు. తాగునీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో తాగునీరు సరఫరా చేయాలని చెప్పారు. ఇంటి పన్నుల వసూళ్లలో అలసత్వం వహించకుండా మార్చి 15 లోపు వందశాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.'జాతీయ ఉపాధి హామీ చట్టం' నిధులు గ్రామపంచాయతీల్లో చేపట్టే ప్రతి పనికి కూడా ఈ నిధులను ఉపయోగించుకోవచ్చని అధి కారులకు తెలిపారు. పొలాలకు వెళ్లే రోడ్లు, ప్రజలకు అవసరమయ్యే నిర్మాణ పనులకు నిధులను సద్విని చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవసర మయ్యే పనులను చేపట్టేందుకు ఎంపీడీ వోలకే నేరుగా అధికారాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో పల్లె ప్రగతి సక్రమంగా అమలు పరిస్తే, సర్పంచులు విజయం సాధించి నట్లేనని తెలిపారు. మురుగు కాల్వల్లో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడూ శుభ్రంగా చేయించా లన్నారు. పిచ్చి మొక్కలను తొలగించేందుకు యంత్రాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ సూచించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు అదనంగా పెంచాలని తెలిపారు.ఈ నర్సరీల నిర్వహణకు, అవెన్యూ ప్లాం టేషన్ సంరక్షణకు ఒక వ్యక్తిని నియమించుకోవాలని పేర్కొన్నారు. నర్సరీల నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు కోల్పోతారని కలెక్టర్ హెచ్చరించారు. ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, పూర్తి వివరాలు ఈ నెల 17 తేదీలోపు ఎంపీఓలు, ఏపీవోలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మిషన్ భగీరథ బాబు శ్రీనివాస్, డీఆర్డీవో అడిషనల్ పిడి స్టీవెన్ నీల్లతో పాటు మండలాల నుంచి జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతీ కార్య దర్శులు పాల్గొన్నారు.