Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాద్నగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్నగర్
హామీలు అమలుచేయని ప్రభుత్వాలను గద్దె దింపాలని, ప్రజలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని మున్సి పాలిటీని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ హాత్ జోడో కార్యక్రమాన్ని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు కె చెన్నయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. బస్తీల్లో ప్రజలను కలిసి వారికి కాంగ్రెస్ లక్ష్యాల గురించి వివరించారు.ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదని, దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క హామీ బస్తీలో నెరవేర్చలేదని విమర్శించారు. బస్తీల్లో కొంతమంది దళారులు, నాయకుల మాటలు నమ్మి ఓట్ల సమయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధుల మెప్పు పొందేందుకు కొంతమంది నాయకులు, ప్రజలకు ఆర్థికంగా ఆశ చూపి వాళ్లు ప్రయోజనం పొందుతున్న వారిని, నమ్మవద్దని సూచించారు. బస్తీ ప్రజలకు తాను అండగా నిలుస్తానని భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బస్తీల్లో ఇంటి నిర్మాణాలకు రూ.5 లక్షలు, పేద ప్రజలకు నూతన ఇండ్లు నిర్మించి ఇస్తామని అలా ఇవ్వకపోతే తనతో సహా పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, మైనార్టీ నాయకుడు బాబర్ ఖాన్ మళ్లీ బస్తీలో తిరిగి అడుగుపెట్టబోమని శపథం పలికారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రజల కష్టాలు తీరబోతున్నట్టు తెలిపారు. షాద్ నగర్ మున్సి పాలిటీ అభివృద్ధి పై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని దమ్ముంటే తనతో చర్చకు రావాలంటూ పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.