Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే, అధికారులపై చర్యలు
- శ్మశాన వాటికలు పార్కుల్లా తీర్చిదిద్దాలి
- దోర్నపల్లి పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్
- చదువే ఏకైక ఆయుధం
- జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
నవతెలంగాణ-దోమ
గ్రామాభివృద్ధిలో వెనుకబడిన సర్పంచులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కలెక్టర్ ట్రైని కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి దోమ మండల పరిధిలోని ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, శ్మాశాన వాటిక, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రంతో పాటు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.అనంతరం ఎంపీడీవో కార్యాల సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపడుతోందనీ, దీనికి గ్రామాల్లోని సర్పంచులు, అధికారులు సమిష్టిగా కలిసి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డు నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన అన్నారు. నర్సరీలు ఎప్పుడూ మొక్కలతో పచ్చగా కళకళలాడే విధంగా ఉండేందుకు సకాలంలో నీరు అందించాలని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ చట్టం కింద వివిధ పనులు చేసేందుకు వీలునప్పటికీ నిర్లక్ష్యం వహిం చొద్దని ఆదేశించారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగు నీటి సౌకర్యంపై ఎప్పటి కప్పుడు అధికారులు ఆరాతీస్తూ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు తీసి, చెట్లను సంరక్షించాలని సూచించారు.
'దోర్నపల్లి పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్ సస్పెండ్'
ప్రకృతి వనం, నర్సరీ, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్ నిర్వహణలో నిర్లక్ష్య వహించిన దోర్నల్ పల్లి పంచాయతీ కార్యదర్శి సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ నారాయణరెడ్డిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్న ఎంపీఓకు మెమో జారీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.
చదువే ఏకైక ఆయుధం
గ్రామాల్లో చదువే ఏకైక ఆయుధమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో భాగంగా దొర్నల్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థిని విద్యార్థులతో వారు అభ్యసిస్తున్న పాఠాలను అడిగి తెలుసుకుని, పిల్లల సామర్థ్యం తెలుసుకునేందుకు బోర్డుపై రాయిం చారు.చదువే ఏకైక ఆయుధమని,బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని కలెక్టర్ తెలిపారు. ఆ సమీపంలోనే ఉన్న అంగన్వాడీ, ఆశావర్కర్ల విధివిధానాలపై పలు సూచనలు చేశారు. పాఠశాలకు సరఫరా అయిన బియాన్ని, అదేవిధంగా వంటగదిని పరిశీలించారు. అనంతరం అధికారుల సమావేశానికి ముందుగా ఎంపీడీవో తహసీల్దార్ కార్యాలయాలను, రికార్డు గదిని కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.