Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేరులో మార్పు తప్పా బతుకు మారలే..
- అంగన్వాడీలకు అందని టీచర్ వేతనం
- అదనపు పని భారంతో సతమతం
- ఏండ్ల కొద్ది పెండింగ్‌లోనే అలవెన్సులు
- మార్చి 1,2,3 తేదీల్లో సమ్మె
- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ అంగన్వాడీల డిమాండ్
అంగన్వాడీ వర్కర్ పేరును సీఎం కేసీఆర్ టీచర్స్‌గా ప్రకటించి గౌరవించారు. కానీ టీచర్స్‌గా గుర్తించడం తప్పా తమకు ఒరిగిందేమీ లేదని అంగన్వాడీ టీచర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ పేరుతో పని భారం పెరిగిందే కానీ ఆకలి మంటలు చల్లారలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'మా హక్కుల సాధనకు ఎంత వరకైనా పోరాడుతాం. పెండింగ్‌లో ఉన్న అలవెన్సులు, పనికి తగ్గ వేతనం వచ్చే వరకూ మా పోరాటం ఆగదు' అని అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో పోరుకు సిద్ధం అవుతున్నారు. మార్చి 1,2,3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్నసమ్మెకు సై అంటున్నారు.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ టీచర్లు సుమారు నాలుగు వేల మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2,500 మంది అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. వికారాబా ద్లో 1,500 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందినవారే. పేరుకు చెప్పుకోవడానికి టీచర్లు తప్పా వారి కుటుంబ జీవనం దుర్భరం. ఎన్నో ఏండ్లుగా అంగన్వాడీ కేంద్రాలను నడుపుతూ చాలీచాలని అరకొర వేతనాలతో కాలం వెళ్లాదిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అంగన్వాడీ వర్కర్‌ను టీచర్లుగా ప్రమోటు చేస్తే అంగన్వాడీలు ఉప్పొంగి పోయారు. టీచర్లుగా గుర్తింపు పొందిన ఆనందంతో తమ బతుకులు మారుతాయని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు నీటి మీది రాతలే అయ్యాయి. వేతనాలు పెంచకపోవగా కేంద్ర ప్రభుత్వం 2018లో పెంచిన వేతనం నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న అలవెన్స్‌లను సైతం ఇవ్వకుండ కొర్రీలు పెట్టడం అంగన్వాడీలను ఆందోళనకు గురిచేస్తోంది.
పెరిగిన భారం..
అన్లైన్ యాప్‌ల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక యా ప్ తెస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మరో యాప్ తీసుకువచ్చింది. అంగన్వాడీ టీచర్లుకు తలకు మించిన భారం మోపుతున్నాయి. కేంద్రం పోషన్ ట్రాకర్ యాప్, రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌టీఎస్ పెట్టడంతో అంగన్వాడీ టీచర్లు పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
హక్కుల సాధానకై పోరాడుతాం
40 ఏండ్లుగా పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి సేవలందిస్తున్న తమకుకనీస వేతనం, పింఛన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడాలు డిమాండ్ చేస్తున్నారు. 20 సమస్యలు పరిష్కారించాలన్న డిమాండ్‌తో మార్చి మొదటి వారంలో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్దమవు తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలో వందలాది మందితో రెండు రోజుల పాటు సమ్మె చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మార్చి 3వ తేదీన కలెక్టరేట్ ఎదుట వేలాది మందితో సమ్మె చేపట్టేందుకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ( సీఐటీయూ ) అంగన్వాడీలను ఐక్యం చేస్తోంది. తమ హక్కులు సాధించే వరకూ పోరు అగదని అంగన్వాడీలు తేల్చి చెబుతున్నారు.
టీచర్లకు సమానకం వేతనం ఇవ్వాలి
అంగన్వాడీ వర్కర్స్‌ను టీచర్లుగా గుర్తించిన ప్రభుత్వం టీచర్లుతో సమానంగా వేతనాలు ఇచ్చి గౌరవించాలి. రాష్ట్ర ఫ్రభుత్వం తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనం ఇవ్వాలి, పెండింగ్‌లో ఉన్న అలవెన్సులను విడుదల చేయాలి. లేని పక్షంలో అంగన్వాడీ టీచర్లను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతాం. మార్చి మొదటి వారం లో చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలి.
- జి. కవిత, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి
హక్కులకై పోరాడుతాం
ఎన్నో ఏండ్లుగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎట్టికి పనిచేస్తున్నాం. కష్టానికి తగ్గ వేతనం వస్తోందన్న ఆశ అడియాశలుగా మిగిలిపోతుంది. ఇక ప్రభుత్వాలు చెప్పే కాకమ్మ కబుర్లు వినే ప్రసక్తి లేదు. ప్రభుత్వాలపై పోరాటం చేసి మా హక్కులు సాధించుకుంటాం. అందుకు కార్యచరణ రూపొందించుకుంటున్నాం.
- రాజ్యలక్ష్మి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు