Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో వరుసగా కుక్కల దాడులు
- గుంపులు గుంపులుగా తిరుగుతున్న శునకాలు
- బడి పిల్లల తల్లిదండ్రుల ఆందోళన
- గేదెలు, గొర్రెల మందలపైనా దాడులు
- ద్విచక్ర వాహనదారులను వెంటాడుతున్న వైనం
- యాచారం మండల కేంద్రంలో 9 మందిపై దాడులు
- అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచనలు
వీధికుక్కలు.. ఇప్పుడు ఈ పేరువిన్నా.. వాటిని చూసినా జనం బెంబేలెత్తిపోతున్నారు. పగలూ,రాత్రి అనే తేడా లేకుండా వీధుల్లో విచ్ఛలవిడిగా సంచరిస్తూ, కనిపించినోళ్లపై దాడికి దిగుతున్న ఘటనలు ఇటీవల వరుసగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో వీధి కుక్కల సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో కుక్కలు దాడి చేసిన ఘటనలున్నా.. వాటి నియంత్రణలో అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఒకవేళ ఘట నలు జరిగిన సమయంలో చర్యలు చేపట్టినా అవి 'ఆరంభశూరత్వం'గానే మిగులు తున్నాయన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కుక్కల బెడదను నివారించేందుకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, వాటిని హతమార్చేవారు. అయితే ఈ చర్యను జంతుహింస కింద పరిగణించిన న్యాయ స్థానాలు శునకాలను చంపొద్దని ఆదేశాలివ్వడంతో.. వాటి నియంత్రణ చర్యలను అధికారులు గాలికి వదిలేశారు. దాంతో రోజురోజుకు కుక్కల బెదడ తీవ్రంగా కన్పిస్తుంది. ప్రజలపై దాడి చేసి, గాయాలపాలు చేస్తున్నాయి. మూగ జీవాలను చంపుకుతింటున్నాయి.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నగరం నడిబొడ్డున ఆడుకుంటున్న నాలుగేండ్ల ప్రదీపను చుట్టు ముట్టిన వీధికుక్కలు దాడిచేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించింది. మూడు రోజు క్రితం యాచారంలో 9 మందిని వీధి కుక్కలు వెంటాడి కరిచాయి. వీటిని మరువకముందే జిల్లాలో మూగజీవాలైన గొర్రెలు, మేకల మందపై దాడి చేస్తున్నాయి. ఈ ఘటనలు జనంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వీధికుక్కల దాడులతో జనంలో భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. వాహానాల వెంట పడి కరుస్తున్న ఘటనలు అనేకం. వారం రోజుల క్రితం యాచారంలో కుక్కల దాడులు తెరమీదకు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలోని బాలికల ఉన్నత పాఠశాల ముందు కాలనీలో రోడ్డుపై ఆడుకుంటున్న నలుగురు చిన్నారులను ఓ వీధికుక్క వెంటపడి గాయ పర్చింది. సుమారు నెల రోజుల పాటూ ఆ చిన్నారులు ఆస్పత్రిలో చిక్కిత్స పొందారు. అదే కాలనీకి చెందిన నర్సింహ వ్యక్తిపై దాడి చేశాయి. వారం రోజుల్లో సుమారు 10 మందిపై దాడి చేశాయి. ఇలా రోజుకో చోట వీధి కుక్కల దాడులు కొనసాగుతున్నాయి.
గుంపులు.. గుంపులుగా
జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో వేలల్లో వీధికుక్కలు తిరుగుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఐదారు వేలకు పైగా కుక్కలుంటాయన్న అంచనా. అవి గుంపులుగా చేరి పాదచారులపై దాడులు చేయడంతో పాటు వచ్చిపోయే వాహనాల వెంట పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా చికెన్, మటన్షాలున్న ప్రాంతాలు, హస్టళ్ల వ్యర్థాలు పడేసే ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కోళ్లఫారాలే వాటిని నివాస కేంద్రాలుగా మారాయి. చనిపోయిన కోళ్లను విచ్ఛలవిడీగా రోడ్లవెంట పడేస్తుండటంతో వాటిని తిన్న కుక్కలు వాహనదారులపై దాడులకు పూనుకుంటున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న కుక్కల నియంత్రణ తలకు మించిన భారంగానే పరిగణించాల్సి ఉంది. వాటి సంతాన ఉత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించి, కుక్కలు పెరగకుండా చూడటమే తప్ప తామేం చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.
నియంత్రణ చర్యలు శూన్యం..
ప్రతి మున్సిపల్ పరిధిలో కుక్కలను పట్టుకునేందుకు ఒక వాహనం ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కుక్కల తరలింపు బాధ్యతను జీహెచ్ఎంసీ వారికే ఉండటంతో మున్సిపల్, గ్రామ పంచాయతీకి అధికారులు పట్టించుకోవడం లేదు. ఒక వేళ్ల జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించినా వారు కుక్కలను పట్టుకునేందుకు అయ్యే ఖర్చులను కూడా గ్రామ పంచాయతీలే బరించాల్సి ఉంటుంది. కానీ కుక్కలు తమ వీధుల్లో విపరీతంగా సంచరిస్తున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తే ఎప్పటికోగానీ స్పందించటం లేదన్న విమర్శలున్నాయి. మరీ ఒత్తిడి ఎక్కువయితే ఒక డివిజనలో కుక్కలను పట్టుకెళ్లి వేరే డివిజన్లలో వదులుతున్నారని తెలుస్తోంది. అయితే కుక్కలకు శస్త్రచికిత్సలు చేయకపోవడంతో వాటి సంతానం విపరీతంగా వద్ధి చెందుతున్నట్టు తెలుస్తోంది.
అప్రమత్తంగా ఉండాలి
కుక్కకాటుపై నిర్లక్ష్యం చేయవద్దని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బుల్లెట్ అకారంలో ఉండే రాబ్డిడో అనే వైరస్ కుక్కకాటు ద్వారా మనుషులకు చేరుతుంది. వైద్య పరిభాషలో ర్యాబీస్గా పిలుస్తారు. ర్యాబీస్తో అనేక మంది చనిపోతున్న సంఘటనలున్నాయి. కుక్కలో వైరస్ నాడుల ద్వారా నాడీ కేంద్రానికి చేరుతుంది. అక్కడ విస్తరించి మెదడులోని కణాలను ధ్వంసం చేస్తుంది. ఈ వైరస్ నాలుగు నుంచి ఆరు వారాల్లో ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ మధ్య కాలంలోనే కుక్క సోమరిగా తిరుగుతూ ఏం తినకుండా జ్వరంతో బాధపడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. కుక్క మెదడు మీద వైరస్ ప్రభావం పెరగడంతో కోపంతో మనుషులపైనా, వస్తువులపైనా దాడి చేస్తుంది. కుక్కకరిస్తేనే ప్రాణాంతకమని భావించవద్దు. గోళ్లతో గీరిన, రక్కిన పండ్లు గీసుకపోయిన అంతకుముందే ఉన్న గాయాలపై నాకిన మనం తినే ఆహారంలో మూతి పెట్టినా, చొంగ కార్చినా, పసిపిల్లలు వాడే ఆటవస్తువులను కుక్కలు నాకినా వాటిని పిల్లలు నోట్లో పెట్టుకున్నా ర్యాబీస్ వ్యాధి రావడానికి మార్గాలుగా భావించాలని వైద్యులు పేర్కొంటున్నారు.
అందుబాటులో వ్యాక్సిన్
జిల్లాలో కుక్కకాటు విరుగుడుకు సంబంధించి మందుల కొరత లేదు. యాంటీ ర్యాబీస్ ఇమ్యూనోగ్లోబ్యూలీన్వ్యాక్సిన్ (ఎఆర్వీ) అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. కుక్కకాటు, కోతులు దాడులు చేసిన తక్షణమే చికిత్స అందిస్తున్నాం. కుక్క కాటును నిర్లక్ష్యం చేయవద్దు. కుక్కకాటు సంఘటనలు పెరుగుతున్న క్రమంలో అందుకు అనుగుణంగా చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
- డాక్టర్ ధరణి కుమార్ డిప్యూటీ డీఎంహెచ్ఎం
నియంత్రణ చేపట్టాలి
కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. గొర్రెలు, మేకల మందలపై పడి దాడులు చేసి చంపే స్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో మనుషులను కూడా వదలడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. సంతానోత్పత్తి నియంత్రణ చికిత్సలు చేయాలి.
- పోచమోని కృష్ణ, మాజీ సర్పచ్