Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందె మోహన్
నవతెలంగాణ-షాద్నగర్
మెడికో విద్యార్థిని ప్రీతి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందె మోహన్ అన్నారు. సోమవారం షాద్ నగర్ ముఖ్య కూడలిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఆందోళన, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకుంటే హదయం ద్రవిస్తుందన్నారు. ప్రీతి తండ్రి తన బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తున్నాడని ఫిర్యాదు చేసిన వెంటనే ఆ కాలేజీ యాజమాన్యం బాధ్యులపై సరైన రీతిలో స్పందించి ఉంటే, ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదన్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలని డిమాండ్ చేశారు. సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలని సూచించారు. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని యువతకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖదీర్, ముబారక్ అలీ ఖాన్, అర్జున్ లక్ష్మణ్, భాస్కర్, జాఫర్, ప్రదీప్, అనిల్, గణేష్ నాయక్, రెహమాన్, రాజు, సాయి వంశీ, మోహన్, ఆకాష్, తేజ పాల్గొన్నారు.