Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్ని ప్రమాదాలకు కేరాఫ్ కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం
- వేసవి వచ్చిందంటే కార్మికుల గుండెల్లో గుబులు
- ఆందోళన కల్గిస్తున్న గత ఘటనలు
- అగ్గి రాజుకుంటే బొగ్గే
- ఫైర్ స్టేషన్ ఏర్పాటు హామీలకే పరిమితం
- బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్న కార్మికులు
- మౌలిక వసతులు కల్పించని ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతాల్లో కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం ఒకటి. ఇక్కడ తయారైన వస్తువులు మన దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి అవుతాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వలస కార్మికులు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు. అయితే దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమల్లో ఇప్పటికే మౌలిక సదుపాయాల కల్పన ప్రశ్నార్ధక మే. వేసవి వచ్చిందంటే యజమానుల దగ్గర నుంచి కార్మికుల వరకు గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. వేసవిలో అగ్ని ప్రమాదాల వలన చాలా పరిశ్రమల్లో భారీ ఆస్తి, నష్టం ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఇక్కడ ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని పలుమార్లు కంపెనీ యాజమాన్యాలు, కార్మికులు ప్రభుత్వాల దృష్టికి తీసుకొని వెళ్ళినా లాభం లేకుండా పోయింది. వేసవి సమీపిస్తున్న తరుణంలో ప్రమాదపుటంచున ఉన్న కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంపై కథనం.
నవతెలంగాణ-రాజేంద్రనగర్
భయాందోళనలో కార్మికులు
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువగా వలస కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు జీవనోపా ధిని పొందుతున్నారు. వేసవి వచ్చిందంటే కార్మికులు కంపెనీలో భయం భయంగా పనిచేస్తున్నారు. కంపెనీ యాజమాన్యులు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవ డం.. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే క్షణాల్లో కంపెనీ మొత్తం కాలి బూడిద అయ్యే అవకాశాలు ఉండడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కంపెనీల్లో కార్మికులను బందీలుగా చేసి వారి చేత వెట్టి చాకిరి చేయిం చుకుంటున్నారు. ముఖ్యంగా టాటానగర్, మైలార్‌దేవ్‌పల్లి, గగన్‌పహాడ్ పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని అక్రమ ప్లాస్టిక్ పరిశ్రమల వలన స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే క్షణాల్లో పక్కనే ఉన్న ఇళ్లల్లోకి మంటలు వ్యాపిస్తున్నాయి. కార్మికులతో పాటు కొన్ని కంపెనీ యజమానులు కూడా వేసవిలో రిస్కుతో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భారీగా ఆస్తి నష్టం సంభవించిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఫైర్‌స్టేషన్ ఏర్పాటు హామీకే పరిమితం
రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతాల్లో కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతం ఒకటి. ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. దశాబా ్దలుగా ఇక్కడ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని జిల్లా మంత్రులు హామీ ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నూతన పారిశ్రామల ఏర్పా టుకు త్వరతగతిన అనుమతులను ఇస్తున్నామని చెప్పిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పరిశ్రమలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అత్తాపూర్ నుంచి లేదా పాతబస్తీలోని చందూలాల్ బరాదారి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పుతున్నారు. ఇవి కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతాల నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి ఘటనా స్థలానికి చేరుకునే లోపే భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి. అదే ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఆస్తి, ప్రాణనష్టాలను తగ్గించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుతోతపాటు మౌలిక వసతులు కల్పించాలని కార్మికులు కోరుతున్నారు.
కంపెనీలో భద్రత లేదు
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాస్టిక్ కంపెనీ లో 20 ఏండ్లుగా నేను పనిచేస్తున్నాను. ఎండకాలం వచ్చిందంటే భయంతో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని పని చేస్తున్నాం. కంపెనీలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు లేవు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే క్షణంలో కంపెనీ మొత్తం ఖాళీ బూడిద అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మా ప్రాణాలకు రక్షణ కరువైంది.
- దశరథ్, కార్మికుడు, కాటేదాన్
ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి
ఇంత పెద్ద పారిశ్రామిక ప్రాంతాల్లో ఫైర్ స్టేషన్ ఏర్పా టు చేయకపోవడం చాలా బాధాకరం. ఏదైనా అగ్ని ప్రమా దం సంభవిస్తే ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బం ది వచ్చేలోపే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. అదే కాటేదాన్ ప్రాంతంలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేస్తే సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ విషయమే గతంలో అనేకసార్లు మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్లినా వారు హామీ ఇచ్చి ఇప్పుడు పూర్తిగా విస్మరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇక్కడ ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేయాలి.
- రాజ్‌కుమార్, కంపెనీ యజమాని
గతంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలు :
1. రెండేండ్ల క్రితం మైలార్‌దేవ్‌పల్లిలోని పల్లె చెరువు వద్ద పరుపుల గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ సజీవ దహనం అయింది.
2. నాలుగేండ్ల క్రితం ఉప్పరపల్లి కూలర్ల గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు మంది బీహార్ వలస కార్మికులు సజీవ దహనం అయ్యారు.
3. గతేడాది సులేమాన్‌నగర్‌లోని ఫర్నిచర్ షాప్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
4. జనవరి 25న లక్ష్మీగూడాలోని పరుపుల గోదాంలో అగ్ని ప్రమాదం. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.
5. గతేడాది టాటానగర్‌లోని ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూర్తిగా గోదాం కూలి ఇద్దరు కార్మికులకు గాయాలు అయ్యాయి.