Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య
- రెండవ రోజుకు చేరుకున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె
- ఆమనగల్ లో అంగన్వాడీ టీచర్ల నిరసన ర్యాలీ
నవతెలంగాణ-ఆమనగల్
ఐసీడీఎస్‌కు నష్టం కలిగించే విధంగా ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధాన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చేపడుతున్న నిరసన మూడు రోజుల సమ్మెలో భాగంగా గురువారం రెండవ రోజు ఆమనగల్ పట్టణంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఆమనగల్ కడ్తాల్ తలకొండపల్లి మాడుగుల తదితర మండలాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు దాదాపు 300 మంది ఐసీడీఎస్ కార్యాలయం నుంచి స్థానిక బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు గుమ్మడి కురుమయ్య హాజరై మాట్లాడారు. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయించుకుంటు న్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కనీస వేతన చట్టం వర్తింప చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. 2018 అక్టోబర్‌లో కేంద్రం పెంచిన అంగన్వాడీలకు రూ.1,500లు, మినీ అంగన్వాడీలకు రూ.1,250లు, హెల్పర్లకు రూ.750 లతోపాటు ఏరియర్స్ తోసహా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. అదేవిధంగా 2015 నుంచి పెండింగ్‌లో ఉన్న టీఏడీఏ బకాయిలు మొత్తం చెల్లించాలని రేషన్ షాప్, ట్రాన్స్పోర్ట్ చార్జీలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు డబ్బులు పెంచాలన్నారు. వేసవికాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటిం చాలని, జీవో నెంబర్ 14,19,8లను వెంటనే సవరించాలని తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఆసరా పింఛన్లు కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై చేపడుతున్న సమ్మెకు ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని కురుమయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సెక్టార్ల పరిధిలో ఉన్న అంగన్ వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు నిర్మల, వసంత, లక్ష్మి, శైలజ, నిర్మల, పద్మ, రాజ్యలక్ష్మి, సుగుణమ్మ, సునీత, జ్ఞానేశ్వరి, సంగీత, అలివేలు, అనసూయమ్మ, గీత, విజయ లక్ష్మి, కళావతి, కళావతి లక్ష్మి, యాదమ్మ పాల్గొన్నారు.