Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సీపీఐ(ఎం) నాయకుల వినతి
నవతెలంగాణ-కందుకూరు
ఇండ్ల స్థలాలకు సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ స్థలాలు చూయించాలని సీపీఐ(ఎం) నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కందుకూరు మండల కేంద్రంలోని కొత్తగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 788లో 2007 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిరుపేదలకు ఇండ్ల స్థలాల కోసం సర్టిఫికెట్లు అందజేశారని గుర్తు చేశారు. ఆ స్థలాలు చూపించాలని కోరుతూ సీపీఐ(ఎం) నాయకుల ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో ఆమెకు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ స్థలాలు కూడా చూపిస్తామని హామీనిచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు దుబ్బాక రామచందర్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బి.శ్రీనివాస్, మండల నాయకులు ఎ.కుమార్, బుట్టి బాలరాజు, శేఖర్, సత్తయ్య, కె. రాములు,జి. కుమార్, కె. కుమార్ తదితరులు పాల్గొన్నారు.