Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్న శతాబ్ది టౌన్ షిప్
- పట్టించుకోని రెవెన్యూ అధికార యంత్రాంగం
- రేరా చట్టం ప్రకారం వెంచర్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగాళ్ల భాస్కర్ డిమాండ్
నవతెలంగాణ-షాద్‌నగర్
కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని అక్రమార్కులు దర్జాగా దోచేసుకుంటుంటే రెవెన్యూ అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగాళ్ల భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరూక్ నగర్ మండల పరిధిలోని కిషన్ నగర్ గ్రామంలో 33.10 ఎకరాల ప్రభుత్వ భూమిని శతాబ్ది టౌన్షిప్ వెంచర్ నిర్వాహకులు ఆక్రమించుకున్న విషయపై, సీపీఐ(ఎం) షాద్‌నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించి మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని కిషన్ నగర్ గ్రామపంచాయతీలో 618 సర్వే నెంబర్లో 33 ఎకరాల10 గుంటల భూమిని శాతాబ్ది వెంచర్ నిర్వాహకులు అప్పనంగా ఆక్రమించుకున్నా, మండల రెవెన్యూ అధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగం కబ్జాదారుల కన్ను సన్నుల్లో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ భూములను కాపాడండి సారు అని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే కనీసం స్పందించకపోవడం బాధరమన్నారు. ఇప్పటికే వెంచర్ నిర్వాహకులు ఆక్రమించుకున్న భూమిలో నిర్భయంగా ప్లాట్లు చేసి రోడ్లను కూడా ఏర్పాటు చేయడం చూస్తుంటే అధికారులతో నిర్వాహకుల స్నేహ సంబంధాలు ఎలా ఉన్నాయో స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేద కుటుంబాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ భూములకు రక్షణ కరువు : ఎన్ రాజు
ప్రభుత్వ భూమికే రక్షణ కరువైందని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్. రాజు అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే భూ ఆక్రమణ దారులకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ భూములను ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అక్రమార్కులిచే అమ్యామ్యాలతో అధికారులు గాడానిద్రలో ఉంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను కాపాడండి అని అధి కారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కోట్ల విలువ చేసే భూ ఆక్రమణ వెనుక ఎంతటి వారినైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ(ఎం) కార్యకర్తలతో కలిసి భూమిని స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచిపెడతామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సీపీఐ(ఎం) నాయకులు బీసా సాయిబాబు, పి శ్రీను నాయక్, ఈశ్వర్ నాయక్, చంద్రమౌళి, కురుమయ్య, రాజశేఖర్, కె రాజు, శంకరమ్మ, గ్రామస్తులు నల్ల నర్సింలు, శ్రీరంగాపురం లక్ష్మయ్య, జలకుంటా శ్యాంసుంధర్, చాకలి శ్రీశైలం, జోగు మల్లేష్, శ్రీనివాస్‌గౌడ్, విట్యాల రవీందర్, చిల్కమరి యోగి, ముకుపోగుల ప్రవీణ్ గౌడ్, సాటు శివ శంకర్ యాదవ్, మనోహర్ గౌడ్, బొబ్బిలిగం పాండు, మాలిరెడ్డి గూడం రమేష్, బొబ్బిలిగాం శ్రీశైలం, ఉడిత్యాల యాదగిరి, మొగిలిగిద్ద అనిల్, విష్ణు, దాసరి యాదగిరి, మాదేపురం కృష్ణ తదితులు పాల్గొన్నారు.