Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో శుభ్రత,ఆహ్లాకరంగా ఉండేలా పనులు చేపట్టాలి
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
గ్రామాల్లో శుభ్రత, పచ్చగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా విధులు నిర్వహించాలనీ, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటూ, పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక సత్య భారతి ఫంక్షన్ హాల్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఓలు, గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పనులపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, ప్రభుత్వ లక్ష్యాల అమలుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమర్థవంతమైన పాలన జరగాలనే ఉద్దేశంతోనే 2018లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాలలో హరితహారం, పారిశుధ్య పనులకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు తెలిపారు.ఈ పనులలో నిర్లక్ష్యం వహిస్తే, ప్రజలతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా పది పనులను చేపట్టాలని సూచించారు. ఇందులో హరితహారం నర్సరీలు, శ్మశానవాటికలు, కంపోస్టు షడ్ల నిర్వహణ, ( తడి పొడి చెత్త సేకరణ), పల్లె ప్రకృతి వనం, అవెన్యూ ప్లాంటేషన్, ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా, సమస్యలు లేని విద్యుత్ సరఫరా, క్రీడా ప్రాంగణాలు, గ్రామపంచాయతీలలో అయ్యే ఖర్చులకు సంబంధించిన చెల్లింపులతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ కూలీలతో పనులు చేపట్టాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కూలీలతో ప్రతి గ్రామంలో కనీసం రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు, చెరువులు కుంటలలో పూడికతీత పను లను చేపట్టాలని తెలిపారు. ఈ పనులలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలు, గ్రామ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పూర్తి బాధ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.పై అంశాలపై పూర్తిగా దృష్టి సారించాలని తెలిపారు. గ్రామాలన్నీ అభివృద్ధి చెందేలా కృషి చేయాలనీ, ఈ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు తప్పని హెచ్చరించారు. పనిచేసే వారికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందించడం జరుగుతుందన్నారు. ఈనెల 25 తర్వాత క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించనున్నట్టు చెప్పారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వపరంగా సిమ్ కార్డులను అందించి నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెట్ సిబ్బంది అందరూ ఘనంగా సన్మానించారు.ఈ సమావేశంలో డీఆర్డీవో కృష్ణన్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, తాండూర్ డివిజనల్ పంచాయతీ అధికారి శంకర్‌నాయక్, ఏపీడి సరళ కుమారి పాల్గొన్నారు.