Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్
నవతెలంగాణ-షాద్‌నగర్
బీసీలకు అధికారం తెచ్చిపెట్టేందుకే బీఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం గ్రామంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల న్యాయమైన పోరాటం వైపు బీఎస్పీ పార్టీ పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ అధికారంలోకి రానీయ కుండా అణగదొక్కాలని చూస్తున్న అగ్రకుల బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. బీసీల ఓట్లు దండుకుని మోసం చేసే ధ్యాసే తప్పా, అభివృద్ధి పథంలో అదలమెక్కిచ్చే ఆలోచన ఆయా పార్టీలకు లేదన్నారు. బీసీల బతుకులలో వెలుగు కోసమే బీఎస్పీ కోటి సంతకాల సేకరణ చేపట్టిందని తెలిపారు. తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీలకు 60 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలనే సవాల్‌ను ఆ పార్టీలు స్వీకరించేందుకు విముఖత చూపడమే బీసీలను అణచి వేస్తుందనడానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు తుప్పరి కుమార్, కమ్మదనం బూత్ కమిటీ అధ్యక్షులు శివగల ఆంజనేయులు, జయప్రకాష్, పెద్దింటి మహేందర్, కొండేటి రమేష్, పెద్దింటి కుమార్, చెన్నయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.