Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ' కథనానికి స్పందన
- స్పీడ్ బ్రేకర్స్ వేయించిన మామిడి సిద్ధార్థ రెడ్డి
- సిద్ధార్థ రెడ్డికి స్థానికుల అభినందనలు
- నిధులు లేవని పట్టించుకోని అధికారులు
పెంజర్ల పీఎన్జీ కూడలి వద్ద ప్రమాదాలపై 'ప్రాణాలు పోతే గాని స్పందించరా.?' అనే కథనం నవతెలంగాణలో శుక్రవారం ప్రచురితమైంది. నవతెలంగాణలో వచ్చిన కథనానికి స్థానిక బీఆర్ఎస్ నాయకులు మామిడి సిద్ధార్థరెడ్డి స్పందించారు. తన సొంత నిధులతో పెంజర్ల పీఎన్జీ కూడలిలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయించారు.
నవతెలంగాణ-కొత్తూరు
వివరాల్లోకి వెళితే... పెంజర్ల సమీపంలోని పిఎన్జి కూడలిలో ఇరువైపులా భూ యజమానులు భారీ ప్రహరీ గోడ నిర్మాణం, ఫ్రీ కాస్ట్ బిల్లలను ఏర్పాటు చేయడంతో ఎటు నుంచి ఎవరు వస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రహరీ గోడ నిర్మాణానికి ముందు అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగేవి కావు. ఇరువైపుల ఫ్రీ కాస్ట్ బిల్లలు నిలువెత్తు ప్రహరీ గోడ నిర్మించిన అనంతరం తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అమ్మ బాబోరు పీఎన్జీ కూడలా అంటూ పలువురు స్థానికులు అక్కడికొస్తే భయపడే పరిస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని నవతెలంగాణ 'ప్రాణాలు పోతే గాని స్పందించరా' అంటూ కథనంతో శుక్రవారం వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో స్థానిక బీఆర్ఎస్ నేత పెంజర్ల సర్పంచ్ తనయుడు మామిడి సిద్ధార్థ రెడ్డి స్పందించి ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయించారు. అందుకు పలువురు స్థానికులు పార్టీలకు అతీతంగా ఆయనను, సమస్య పరిష్కారానికి కృషి చేసిన నవతెలంగాణను అభినందించారు. కూడలి వద్ద ప్రమాదాల విషయంపై ఆర్అండ్బీ ఏఈఈ సందీప్‌ను నవతెలంగాణ ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా మరమ్మతుల నిమిత్తం ప్రపోజల్ పంపించామని, అనుమతులు వచ్చిన వెంటనే అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తరచూ ప్రమాదాలు జరుగుతాయి
పెంజర్ల కూడలిలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మాణిక్యమ్మగూడ నుండి వచ్చే వాహనాలు కొత్తూరు వైపు వెళ్లే వాహన దారులకు దగ్గరికి వచ్చాక గాని కనపడని పరిస్థితి నెలకొంది. నవతెలంగా ణలో వచ్చిన కథనం చూసి వెంటనే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకు న్నాను. నా సొంత ఖర్చులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసిన అనంతరం పలువురు అభినందిస్తుంటే సంతోషంగా ఉంది.
-మామిడి సిద్ధార్థ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెంజర్ల గ్రామం, కొత్తూరు.
నవతెలంగాణ పత్రికకు ధన్యవాదాలు
నవతెలంగాణ పత్రికకు ధన్యవాదాలు. పెంజర్ల సమీపం లోని పీఎన్జీ కూడలిలో నిలువెత్తు ప్రహరి గోడ నిర్మించిన అనంతరం అక్కడ తరచుగా ప్రమాదాలు జరిగి అనేకమంది గాయాల పాలవు తున్నారు. ఇదే విషయాన్ని గతంలో నవతెలంగాణ పత్రిక వెలుగులోకి తెచ్చిన అధికారులు ఎవరూ స్పందించలేదు. తిరిగి శుక్రవారం నవతెలంగాణలో ''ప్రాణాలు పోతే గాని స్పందించరా.? అంటూ వచ్చిన కథనానికి స్థానిక నేత మామిడి సిద్ధార్థరెడ్డి స్పందించి స్పీడ్ బ్రేకర్లు వేయించాడు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా మా అభినందనలు.
- రవీందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కొత్తూరు.