Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనువణువునా విషం నిండిన వ్యక్తి మోడీ
- మోడీ పాలనలో పెరిగిన ఆరాచకాలు
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
నవతెలంగాణ-చేవెళ్ల
బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలోని కెజిఆర్ గార్డెన్లో భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు మోడీ హటావో దేశ్‌కి బచావో ఇంటింటి ప్రచార ముగింపు కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనువణువు విషం నిండిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. నరేంద్ర మోడీ పేరుతో ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయని మండిపడ్డారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను మరిచి.. మనువాద సిద్ధాంతాన్ని దేశ పౌరులకు బలవంతంగా రుద్దుతున్నాడని అన్నారు. మోడీని ఇంటికి పంపించడానికే సీపీఐ జాతీయ సమితి 'ఇంటింటికి సీపీఐ' కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశంలో ఏనాడు లేనివిధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో సహా అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని అన్నారు. యూపీఏ కాలంలో రూ. 400 ఉన్న గ్యాస్ సిలిండర్ నేడు రూ.1200కు పెరిగిం దన్నారు. కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని ఆరోపించారు. బ్రిటిష్ వారి కాలంలో సాధించుకున్న అనేక చట్టాలలోని 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గం పై పూర్తిగా దాడి చేస్తున్నాడని అన్నారు. అందుకే మోడీ హటావో దేశ్ కి బచావో నినాదం ఎత్తుకున్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాలకు వ్యతికేకంగా పోరాడుతున్న పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. మోడీని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, నియోజకవర్గ కన్వీనర్ కే.రామ స్వామి, నియోజకవర్గ కో కన్వీనర్లు ప్రభులింగం, గోపా ల్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ, ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్‌గౌడ్, బీకేయూ జిల్లా అధ్యక్షుడు అంజయ్య, సీపీఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శి మక్బూల్, మొయినాబాద్ మండల కార్యదర్శి కే.శ్రీనివాస్, శంకర్పల్లి మండల కార్యదర్శి పి.సుధీర్, మాధవి, మంజుల, విజయమ్మ, మీనాక్షి, అనురాధ, అన్నపూర్ణ, కందాడ గ్రామ కార్యదర్శి బలవంతరెడ్డి, గీత కార్మికుల సంఘం మండల కార్యదర్శి కృష్ణగౌడ్, బండ ఎలీషా, రామ్ చందర్, బీరప్ప, వినోద్, యాదమ్మ, గోపాల్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.