Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాసబ్ చెరువు పరిరక్షణ సమితి, అఖిలపక్ష పార్టీల డిమాండ్
నవతెలంగాణ-తుర్కయాంజల్
తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో ఉన్న మాసాబ్ చెరువును కాపాడాలని, ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేసి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మాసాబ్ చెరువును రీ-సర్వే చేసి హద్దులు గుర్తించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తా నుండి మాసాబ్ చెరువు వరకు ర్యాలీగా వెళ్లి సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాసాబ్ చెరువు పరిరక్షణ సమితి (అఖిలపక్ష కాంగ్రెస్ సిపిఎం బిజెపి బిఆర్ఎస్ టిడిపి బిఎస్పి ) పార్టీల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరుతో రాష్ట్రంలో ఉన్న చెరువులను కుంటలను వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కు ఆనుకొని ఉన్నటువంటి తుర్కయంజాల్ మాసబ్ చెరువుకు సంబంధించి వందల కోట్ల రూపాయల విలువైన ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో ఉన్నటువంటి భూములు అప్పనంగా అన్యాక్రాంతమై కబ్జాకు గురైతుంటే చోద్యం చూస్తుండడం గర్హనీయమని అన్నారు. ముఖ్యంగా తుర్కయంజాల్ రెవిన్యూ సర్వేనెంబర్ 205 లోని సుమారు 12 ఎకరాల భూమి ఇది పూర్తిగా బఫర్ జోన్ కిందికి వస్తుంది ఈ భూమిలోనీ పట్టాదారులు కేవలం వ్యవసాయం సాగు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది కానీ ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అలాగే మున్సిపల్ అధికారులు కుమ్మక్కై ఇట్టి భూమికి ఎన్ఓసి ఇచ్చి రాత్రి సమయాలలో దొంగ దారిన, అడ్డగోలుగా వందల సంఖ్యలో లారీలు, టిప్పర్లతో మట్టితో చెరువును నింపడం అక్రమ నిర్మాణాలు చేసుకోవడానికి పురిగోల్పి పరోక్షంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు వందల కోట్ల రూపాయలు దండుకునే విధంగా చేశారని అన్నారు. దీని కారణంగా చెరువు యొక్క సమతుల్యత దెబ్బ తినడమే కాక బ్యాక్ వాటర్ పెరిగి అనేక కాలనీలు మునిగిపోతున్నాయని తద్వారా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా రాజకీయ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధుల యొక్క పాత్రను కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తుర్కయంజాల్ మాసబ్ చెరువు భూ ఆక్రమణకు సంబంధించి, అక్రమ నిర్మాణాలకు సంబంధించి, ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇల్లీగల్ ఎన్వోసీలకు సంబంధించి జిల్లా కలెక్టర్ సుమోటోగా చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వమే దీనికి ప్రధాన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించని యెడల అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చూడుతామని ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలను నిర్బంధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి రామచందర్, తుర్కయంజాల్ మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు నాయకులు మంగమ్మ శివకుమార్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కొశిక అయిలయ్య, కౌన్సిలర్లు కొండ్రు మల్లేష్, కాకుమాను సునీల్, బొక్క రవీందర్ రెడ్డి, నాయకులు దన్ రాజ్ గౌడ్, దర్శన్, చిన్నయ్య, చంద్రశేఖర్ రెడ్డి, చెరువుల పరిరక్షణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జి. ఆర్ కరుణాకర్, ప్రముఖ న్యాయవాది అరుణ్ కుమార్, బిజెపి నాయకులు కొత్త అశోక్ గౌడ్, రంగారెడ్డి జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు బచ్చిగళ్ల రమేష్, కొండ్రు పురుషోత్తం, బిఆర్ఎస్ కౌన్సిల్ ప్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, నాయకులు కొంతం యాదిరెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు డి కిషన్, ఈ నరసింహ, ఎం సత్య నారాయణ, భాస్కర్, బిఎస్పి నాయకులు వద్దిగళ్ల బాబు, గ్యార మల్లేష్, మేతరి కుమార్, టిడిపి నాయకులు వీరేశం, వెంకటేష్, తదితర అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.