Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి బోయినపల్లి వినోద్ కుమార్ సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాజీపేటలో రైల్వే వ్యాగన్ల తయారీ కేంద్రానికి ఎంత భూమి కావాలో, దాని కోసం ఎన్ని నిధులిస్తుందో, ఎంత మందికి ఉద్యోగాలిస్తుందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి కొత్త రైళ్ల ప్రస్తావన లేకుండా, కొనసాగుతున్న రైల్వే పనులకు నిధులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ విషయాలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టతనివ్వాలని కోరారు. భూమి ఎంత అవసరమో కేంద్రం స్పష్టం చేస్తే, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. రామగుండం - మణుగూరు రైల్వే లైన్ పనులను నిర్ణీత కాలపరిమితి విధించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ పనుల కోసం కేవలం రూ. 10 కోట్లు మాత్రమే కేటాయించారనీ, ఇది ఏ మాత్రం సరిపోదని పేర్కొన్నారు. బడ్జెట్ లో నిజామాబాద్ - ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ ఊసే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే పూర్తయిన కాజీపేట - హుజూరాబాద్ - కరీంనగర్ రైల్వే లైన్ ను మంజూరు చేస్తారని ఆశించినా.. నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య మూడో రైల్వే లైన్ కోసం మాత్రమేనిధులు కేటాయించారని.. అయితే ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్కు కేటాయించినట్టు ఎలా అవుతుందని వినోద్ కుమార్ ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కొచ్చిలకు బుల్లెట్ రైలు ప్రస్తావనను కేంద్ర ప్రభుత్వం చేయనేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.