Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ సర్కార్ పై పల్లా ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ వివక్ష చూపిస్తున్నదనీ, ఈ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదా? అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. గతంలో దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలకు అనుమతించి తెలంగాణను విస్మరించారనీ, తాజాగా 157 నర్సింగ్ కాలేజీల విషయంలోనూ అదే విధంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సొమ్మును గుజరాత్‌తో పాటు ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకున్నా, ప్రతిపక్ష పార్టీలు అడుగడుగునా అడ్డుకున్నా బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం విద్య, ఉపాధి, వైద్యం, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని వివరించారు. గత పదేండ్లలో వ్యవసాయాభివద్ధిలో రాష్ట్రానికి దేశంలోనే రెండో స్థానం దక్కిందనీ, వైద్యారోగ్య రంగంలో మూడో స్థానంలో నిలిచిందని ఉదహరించారు. సంపదను సీఎం కేసీఆర్ సృష్టిస్తుంటే ప్రధాని కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని విమర్శించారు. ఫీనిక్స్ పక్షిలా అభివృద్ధిని సాధించటం ద్వారా... తెలంగాణ దేశానికే నమూనాగా నిలిచిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తీర్మానాన్ని బలపరుస్తూ, దళితులు, గొల్ల కురుమలు, గంగపుత్రులు, ముదిరాజ్‌లు, గౌడ తదితర సామాజిక వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. జర్నలిస్టుల నిధికి రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ వారికి స్థలాలిచ్చేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
ప్రయివేటు ఆస్పత్రులు మూతపడే పరిస్థితి
ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన వసతులు, సౌకర్యాలతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోగులు వైద్యాన్ని పొందుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. దీంతో ప్రయివేటు ఆస్పత్రులు మూతపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ వల్ల పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆకర్షించిందన్నారు.
కేంద్రం సహకరించకున్నా....
కేంద్రం సహకరించకున్నా, ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడినా అన్ని రాష్ట్రాలకు ప్రేరణ, ఉత్సేజం ఇచ్చేలా తెలంగాణను ప్రగతిపథంలో నడిపిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. ఈ విషయాలను రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో కూలంకషంగా చెప్పారని గుర్తుచేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు కంటి వెలుగు బాగుందంటూ వారి రాష్ట్రాల్లో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రజల తలసరి ఆదాయమే అభివృద్ధికి కొలమానమంటూ, 2014లో రూ.1,24,104గా ఉన్న తలసరి ఆదాయం రూ.3,17,118కి పెరిగిందని తెలిపారు. మహిళలు, శిశువుల సంక్షేమం, ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. నిజామాబాద్ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతానికి చెందిన గ్రామాలు తమనూ తెలంగాణలో కలపాలంటూ తీర్మానాలు చేయడం రాష్ట్రానికే గర్వకారణమని తెలిపారు. ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ సిఫారసుల మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల నుంచి ఒక శాతం వాటా తీసుకుని ఈహెచ్ఎస్ను అమలు చేయాలని కోరారు. మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్ స్కూళ్ల సిబ్బందికి దీన్ని వర్తింపజేయాలన్నారు.