Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పండిత, పీఈటీ జేఏసీ నేతలకు ఎమ్మెల్సీ కవిత హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న భాషాపండితులకు న్యాయం చేస్తామంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్‌లో కవితను పండిత, పీఈటీ జేఏసీ రాష్ట్ర నాయకులు సి జగదీష్, రాఘవరెడ్డి, నర్సింలు, గౌరీ శంకర్, కృష్ణమూర్తి కలిసి వినతిపత్రం సమర్పించారు. భాషా పండితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ హాజరై అప్‌గ్రేడ్ జీవోలపై కోర్టులో ఉన్న స్టేను వెంటనే తొలగించేలా ప్రయత్నించాలని సూచించారు. అది సాధ్యం కాని పక్షంలో అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి భాషా పండితులు, పీఈటీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు తమకు మేలు చేయాలని సూచించారు. అందుకనుగుణంగా సర్వీస్ రూల్స్‌ను మార్చి కూడా జీవోలిచ్చారని తెలిపారు.
10,479 పండితులు, పీఈటీల పోస్టులను అప్‌గ్రేడ్ చేశారని పేర్కొన్నారు. కోర్టులో ఉన్న న్యాయపరమైన చిక్కులను తొలగించడానికి ప్రభుత్వం తరఫున తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తానని కవిత హామీ ఇచ్చారని తెలిపారు. పండితులకు పదోన్నతులు రావడానికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీటీఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కె ఇశ్రాయేలు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి నర్సింగరావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మహావీర్ సింగ్, ప్రధాన కార్యదర్శి గురునాథం తదితరులు పాల్గొన్నారు.