Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పసికందులపై పైశాచికం
- మహిళలు, బాలికలపై ఆగని లైంగికదాడులు
- పెరుగుతున్న గృహ హింస కేసులు
- పనిచేయని రక్షణ చట్టాలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఇల్లు, బడి, పనిచేసే ప్రదేశం.. ప్రాంతం ఏదైనా ఆమెపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ఇంట్లో రక్షించే తండ్రే కామాంధుడు అవుతున్నాడు. బడిలో అన్నగా భావించే తోటి విద్యార్థే అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఎక్కడా ఆమెకు రక్షణ లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆమెను కాపాడలేకపోతున్నాయి. రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లాలో మహిళలు, బాలికలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. సఖీ కేంద్రాల్లో నమోదు అవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. రక్షణ లేక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న మహిళలపై కథనం.
రంగారెడ్డి జిల్లాలో గృహహింస కేసులు, మహిళాలపై అఘాయిత్యాలు, బాలికలపై కామాంధుల లైంగిక వేధింపులు, ఆడపిల్లను భారంగా భావించిన తల్లిదండ్రులు చిత్రహింసలకు గురిచేసే సంఘటనలు పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ కస్తూర్బాగాంధీ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని గత నెల 20 మధ్యాహ్నం సమయంలో కాస్మొటిక్స్ కొనుగోలు కోసం హాస్టల్ నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై టీచర్లు ఆరా తీశారు. తెలిసిన వాళ్లే ఆమెను బయటికి తీసుకెళ్లి, మాయమాటలు చెప్పి ఆమెపై లైంగికదాడికి యత్నించినట్టు గుర్తించారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయించారు. ఫరూఖ్‌నగర్ మండలం కంసానిపల్లికి చెందిన 14 ఏండ్ల బాలికపై కన్న తండ్రే కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి, శారీరకంగా ఆమెను లొంగదీసుకుని, గర్భవతిని చేశాడు. తల్లిలేని బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. నిందితుడిపై పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయించారు. హయత్‌నగర్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోని పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై తోటి విద్యార్థులే ఇటీవల అఘాయిత్యానికి పాల్పడ్డారు. మహేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో ఓ టీచర్‌పై కూడా ఇదే అభియోగంపై పోక్సో యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపారు. ఇలా జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అమాయక ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
జిల్లా సఖీ కేంద్రానికి ఫిర్యాదుల వెల్లువ
మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలోని ఈ కేంద్రానికి బాధితుల నుంచి భారీగా ఫిర్యాదులు (29,496) అందుతున్నాయి. 2018లో 1,029 కేసులు, 2019లో 959 కేసులు, 2020లో 941 కేసులు నమోదు కాగా, 2021లో 978 కేసులు నమోదయ్యాయి. తాజాగా 2022లో 1,048 ఫిర్యాదులు అందాయి. నిజానికి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకొచ్చింది. గృహ హింస, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు సహా పోక్సో యాక్ట్ వంటి చట్టాలను ప్రయోగిస్తోంది. పోక్సోయాక్ట్ 18 ఏండ్లలోపు బాలికలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. పోక్సో కేసు నమోదైతే శిక్షణలు కఠినంగా ఉంటాయి. కేసు విచారణ కూడా మూడు నెలల్లో పూర్తవుతుంది. అయినా మహిళలపై అఘాయిత్యాలు తగ్గకపోగా యేటా మరింతా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
అఘాయిత్యాలకు గురైన వారికి అండగా ఉంటున్నాం
అమాయక బాలికలను నమ్మించి వారిపై శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. సఖి వన్ స్టాఫ్ కేంద్ర నిర్వహకులు వీరికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. దోషులకు శిక్షపడే విధంగా బాధితుల తరపున పోరాటం చేస్తున్నారు. అఘాయిత్యాలకు గురైన వారికి తాత్కాలిక వసతి కల్పించడంతో పాటు నష్టపరిహారం అందిస్తున్నాం. అంతేకాదు, బాధితుల తరపున న్యాయస్థానాల్లో కొట్లాడేందుకు అవసరమైన న్యాయ సేవా సహకారం కూడా అందిస్తున్నాం.
- మోతి, స్త్రీ , శిశు సంక్షేమ జిల్లా అధికారి