Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయంలో తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దళారీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పత్తి దిగుబడి బాగా తగ్గిందని వివరించారు. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, సగటున ఐదు క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని పేర్కొన్నారు. సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పత్తి ధర రూ.9,800లు ఉండగా, దళారీల మోసం వల్ల ఇప్పుడు రూ.ఏడు వేలలోపే అమ్మకాలు సాగుతున్నాయని వివరించారు. వారి లాభాల కోసం రైతులను మోసం చేస్తున్న మార్కెట్ వ్యవస్థలు, కార్పొరేట్ సంస్థలు, మధ్యదళారీలు, కొనుగోలుదారులపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం, సీసీఐ జోక్యం చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారీల ఆట కట్టించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో 60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయినట్టు ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని ధర క్వింటాల్‌కు రూ.12 వేల వరకు ఉండగా, కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను రూ.6,600లుగా నిర్ణయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎకరాకు రూ.50 వేల వరకు రైతు ఖర్చు చేస్తుండడంతో రూ.15 వేలు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యదళారీలు, మార్కెట్ వ్యవస్థలు కుమ్మక్కై ధరలు తగ్గించి కొనుగోలు చేయడం వల్ల రైతులు ఆందోళనకు గురౌతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్ ధరతో సమానంగా సీసీఐతో కొనుగోళ్లను ప్రారంభించాలని సూచించారు. రైతులను మోసం చేస్తున్న దళారీలు, కార్పొరేట్ సంస్థలను అరికట్టాలని కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా పత్తి కొనుగోలు చేసి, మద్దతుధర వచ్చే విధంగా తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.