Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభా నాయకుడే బీఏసీకి రావట్లేదు : ఎంఐఎం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాసనసభా బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శనివారం సభ హీటెక్కింది. ప్రధాన ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. వారిరువురూ ఒకరిపై మరొకరు సెటైర్లు విసురుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అక్బర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించగా... గట్టిగా మాట్లాడి గొంతు చించుకోవటం వల్ల ఉపయోగం ఉండబోదంటూ కేటీఆర్ చురకలంటించారు. దీంతో సభలో ఉద్విగ వాతావరణం నెలకొంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో వారిరువురి మధ్య ఇలా వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. చివరకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలుగజేసుకుని శాంతపరిచేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ అక్బరుద్దీన్ తగ్గకుండా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకుంటూనే...పాతబస్తీలోని సమస్యలను ఏకరువు పెట్టారు. అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపారు. గవర్నర్ ప్రసంగం గతంలో 42 పేజీలుగా ఉండేదనీ, ఇప్పుడు 27 పేజీలకు పడిపోయిందని తెలిపారు. ఎనిమిదేండ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదా? సీఎం కేసీఆర్ బయట అనేక విషయాలు మాట్లాడుతారు, కానీ గవర్నర్ ప్రసంగంలో వాటిని ఎందుకు పొందుపరచలేకపోయారని నిలదీశారు. బీజేపీకి బీఆర్ఎస్కు ఏమైనా ఒప్పందం ఉందా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే చేశారా? లేదంటే గవర్నర్ కొన్ని అంశాలను తప్పించారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఏసీ సమావేశానికి సీఎం హాజరు కాకపోవటం శోచనీయమన్నారు. ఆయనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చల సమయంలో సభలో కనిపించకపోవడాన్ని తప్పుపట్టారు. ఇలాంటి సభను తన 25 ఏండ్లలో ఏనాడూ చూడలేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలకు టీవీ డిబేట్లకు వెళ్లే సమయం ఉంటుంది కానీ సభకు వచ్చే సమయం లేదా? అని ఎద్దేవా చేశారు. 'హామీలు ఇస్తారు.. అమలు చేయరు. సీఎం, మంత్రులు మమ్మల్ని కలవరు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాం. పాతబస్తీలో మెట్రోరైలు సంగతి ఏమిటి? ఉస్మానియా ఆస్పత్రిని ఎప్పుడు నిర్మిస్తారు ? ఉర్దూ రెండో భాషగా ప్రకటించారు.
కానీ అమలు చేయడం లేదు...' అని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ తీర్మానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందా? కేంద్రంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు గుర్తించిందా? లేదా? చెప్పాలన్నారు. దేశంలో 171 మెడికల్ కళాశాలలు, 157 నర్సింగ్ కళాశాలలను ఇస్తే, తెలంగాణకు ఒక్కటీ కూడా ఇవ్వలేదనీ, దాన్ని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. తెలంగాణపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఏ పథకానికి కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు. మక్కా మసీదుకు మరమ్మతులు, చార్మినార్ వద్ద అభివృద్ధి పనులు, ఇస్లామిక్ స్టడీ సెంటర్, ఇమామ్‌లకు వేతనాలు, పాతబస్తీలో స్టేడియం నిర్మాణం వంటి కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్ కౌంటర్...
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. స్లీపింగ్ రిమార్క్స్ చేయొద్దంటూ (వాస్తవాలు తెలుసుకోకుండా) హితవు పలికారు. బీఏసీకి సభా నాయకుడు రాకపోయినా, నలుగురు మంత్రులు హాజరయ్యారని గుర్తు చేశారు. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎంకు గంటసేపు మాట్లాడేందుకు అవకాశమిచ్చారనీ, 105 మంది సభ్యులున్న బీఆర్ఎస్ ఎంత సమయం తీసుకోవాలంటూ స్పీకర్‌ను ప్రశ్నించారు. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని స్పీకర్‌ను కోరారు. అక్బరుద్దీన్ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడకుండా బడ్జెట్ పద్దులపై కూడా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.