Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు
- ఉత్తమ గాయనిగా మూడు జాతీయ అవార్డులు
- వాణీజయరాంకు ఇటీవలే పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం
- మతిపై అనుమానాలు?
హైదరాబాద్: దిగ్దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణ విషాదం నుంచి తేరుకోకముందే మరో గొప్ప గాయనిని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయింది. గత ఐదు దశాబ్దాలుగా తన సుమధుర గానంతో ఆబాలగోపాలాన్ని అలరించిన ప్రముఖ గాయని వాణీజయరాం (78) కన్నుమూశారు. చెన్నైలోని నుంగమ్బక్కమ్లో ఉన్న తన నివాసంలో శనివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్టు బంధువులు తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వసంత్‌దేశారు సహకారంతో 'గుడ్డి' సినిమాలోని 'బోలో రే పపి హరా..' పాటతో ఆమె సినీ గాన ప్రస్థానం మొదలైంది. అనతికాలంలోనే బాలీవుడ్లో అగ్ర గాయనిగా నిలిచిన ఆమె హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ, తులు, భోజ్‌పురి.. ఇలా 19 భాషల్లో దాదాపు 20 వేలకు పైగా భిన్న పాటలతో అలరించారు. ఏ భాషలోనైనా సరే కొత్త నటీమణులకు పాడించాలన్నా, కష్టతరమైన పాటలున్నా సరే.. అలాంటి వారికి కేరాఫ్‌గా వాణీజయరాం నిలిచారు. మూడుసార్లు ఉత్తమగాయనిగా జాతీయ అవార్డులు పొందారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
అయితే వాణీ జయరాం మృతిపట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణమేనా లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అని పలువురు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వాణీ జయరాం ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మహిళ ఫ్లాట్ తలుపుతట్టగా లోపలి నుంచి స్పందన లేదు. ఆమె ఐదుసార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయలేదు. దాంతో పనిమనిషి భర్త తన ఫోన్లోంచి వాణీ జయరాం ఫోన్‌కు కాల్ చేశాడు. అయినా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫోన్ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టించింది. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పహ లేకుండా కింద పడిపోయి ఉన్నారు. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్టుగా తీవ్ర గాయాలున్నాయి. వెంటనే పనిమనిషి, స్థానికులు కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. పనిమనిషి, స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఫ్లాట్‌లోని సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.