Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ బస్సులను ఆర్టీసీలకే అప్పగించాలి
- ఎస్టీయూలను ప్రయివేటీకరించొద్దు
- ఆర్టీసీపై పన్నులను, టోల్ చార్జీలను మోపొద్దు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే మూలధన పెట్టుబడిని పునరుద్ధరించాలి : ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశాభివృద్ధికి ప్రజారవాణా వ్యవస్థ జీవనాడి లాంటిదనీ, అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్(ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో స్టేట్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్ సెక్టార్(ఎస్టీయూ) ప్రతినిధుల సభను నిర్వహించారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ నేత జీవన్సాహా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్టీయూల కన్వీనర్ అర్ముదనయనార్ నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం లక్ష్మయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదార విధానాలను మొదట ప్రయోగించింది ప్రజా రవాణా రంగంపైన్నేనని తెలిపారు. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీ సంస్థలకు ఇచ్చే మూలధన పెట్టుబడిని నిలిపివేశాయని తెలిపారు. వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు బస్సు ఆపరేటర్లకు లబ్ది చేకూర్చటం కోసం ఆర్టీసీ బస్సులను కుదిస్తూ పోతున్న తీరును ఆయన వివరించారు. ఆర్టీసీపై కోవిడ్ ప్రభావం కూడా పడిందని చెప్పారు. మోడీ ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను మొత్తానికి మొత్తంగా ప్రయివేటు గుత్త కంపెనీలకు(ఊబర్, ఓలా, తదితరాలకు) అప్పగించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే మోటారు వాహనాల చట్టం-2019 తీసుకొచ్చిందన్నారు. విద్యుత్ బస్సులను తీసుకురావడం, బల్క్ డీజిల్ సప్లరుపై భారాన్ని మరింత మోపడం, ఒకేదేశం-ఒకే పర్మిట్ విధానం తేవడం, ప్రయాణికులపై విపరీత చార్జీల భారం, ఆర్టీసీ సిబ్బందిపై విపరీత పనిభారం మోపడం, కొత్తకొత్త విధానాలు తీసుకురావడం వంటి చర్యలన్నీ ప్రయివేటీకరణ దిశగా వేస్తున్న అడుగుల్లో భాగమేనని విమర్శించారు. ప్రజారవాణా వ్యవస్థను దెబ్బతీయడం అంటే పర్యావరణ సమస్యలను ఏరికోరి తెచ్చుకోవడమేనని చెప్పారు. అర్ముద నయనార్ మాట్లాడుతూ.. ప్రజలకు తక్కువ ఖర్చుతో భద్రతతో కూడిన ప్రయాణం అందించేందుకే ఎస్టీయూలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా అవి సంక్షోభంలో ఉన్నాయనీ, వాటి పరిరక్షణ కోసం, సిబ్బంది హక్కుల కోసం జాతీయ స్థాయిలో ఐక్య ఉద్యమ నిర్మాణం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. దేశంలోని 90 శాతం ప్రయాణికులు రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణిస్తున్నారనీ, 60 శాతం సరుకు రవాణా కూడా ఇదే మార్గం ద్వారా కొనసాగుతున్నదని వివరించారు. దేశంలో ఏటా లక్షన్నర మంది చనిపోతున్నారనీ, ప్రయివేటు వాహనాల ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని వివరించారు. ప్రజారవాణా రంగంపై ఖర్చుపెట్టే ప్రతి డాలర్ కూడా జీడీపీని నాలుగు డాలర్లకు పెంచుతుందంటూ వరల్డ్ ఎకనామిక్ సెంటర్ నొక్కి చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. గ్లోబల్ వార్మింగ్‌ను ఎదుర్కోవడానికి, ప్రమాదాలను తగ్గించడానికి ఏకైక మార్గం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమేనన్నారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి వీఎస్‌రావు మాట్లాడుతూ..ఆర్టీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలనీ, సబ్సిడీలను తిరిగి చెల్లించాలని కోరారు. ఈ మీటింగ్‌లో ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ కోశాధికారి హరిక్రిష్ణన్, కార్యదర్శులు వినోద్, కొప్పుస్వామి, ఇంద్రకుమార్ బందానా, జాతీయ నాయకులు పి.రవీందర్‌రెడ్డి, 27 రాష్ట్రాల నుంచి 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
డిమాండ్లు ఇవే...
- ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం మూలధన పెట్టుబడిని పునరుద్ధరించాలి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించాలి.
- డీజీల్‌పై ఎక్సైజ్ సుంకం, అమ్మకం పన్ను నుంచి ఎస్టీయూఎస్లను మినహాయించాలి.
- ఆర్టీసీ బస్సులకు టోల్ చార్జీల నుంచి మినహాయింపునివ్వాలి.
- విద్యుత్ బస్సుల నిర్వహణ బాధ్యతను ఆర్టీసీలకే అప్పగించాలి.
- ప్రజా రవానా వాహనాలకు రోడ్లపై ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి.