Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగళ్లే కాదు పెన్నులు పట్టి చట్టాలు చేయండి
- రైతు ఆత్మహత్యలకు బీజేపీ-కాంగ్రెస్‌లే ముద్దాయిలు
- 'మేక్ ఇన్ ఇండియా'.. 'జోక్ ఇన్ ఇండియా'గా మిగిలింది..
- రైతులు చస్తుంటే 'మన్ కీ బాత్' ఇంకెన్నాళ్లు?
- మహారాష్ట్ర-తెలంగాణది 'రోటీ-బేటీ' సంబంధం
- మహారాష్ట్రలో గులాబీ జెండా ఎత్తండి : మహారాష్ట్రలోని నాందేడ్ సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
'ప్రతిసారి ఎన్నికల్లో నాయకులు గెలుస్తున్నారు. ప్రజలు ఓడుతున్నారు. ఇకపై ఎన్నికల్లో ప్రజలు, రైతులు గెలవాలి. నాగళ్లు పట్టిని రైతులు పెన్నులు పట్టి చట్టాలు చేయాలి. రైతు రాజ్యం వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి' అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో రైతాంగ ఆత్మహత్యలకు, సంక్షోభానికి బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు. 75 ఏండ్ల స్వాతంత్ర భారతదేశంలో ఈ రెండు పార్టీలే 70ఏండ్లు దేశాన్ని పరిపాలించాయ న్నారు. ఈ రెండు పార్టీలు 'నువ్వింత తిన్నావ్ అంటే నువ్వింత తిన్నావ్ అని, మీది ఈ కుంభకోణం అంటే మీది ఆ కుంభకోణం అని, ఒకరు అంబానీ, ఒకరు అదానీ పేర దేశాన్ని దివాళా తీయించారని వాపోయారు. దేశంలో స్థితిగతులను పరిశీలించిన తరువాత విధానాలు మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తించి జాతీయస్థాయిలో పని చేయాలని బీఆర్ఎస్(భారత రాష్ట్ర సమితి)ని ఏర్పాటు చేసినట్టు చెప్పుకొచ్చారు. రైతాంగ సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న అన్ని పథకాలను దేశ స్థాయిలో అమలు చేస్తామని వివరించారు. రైతులు మతం పేర, కులం పేర, జెండా పేర విభజన కాకుండా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
'అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' పేరిట మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఆదివారం జరిగింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించారు. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత ఇతర రాష్ట్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. మొదట నాందేడ్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్.. గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అనంతరం సభా వేదికకు వచ్చారు. మొదట స్థానిక నాయకులకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రసంగానికి ముందు వేదికపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబాఫూలే తదితర మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, పరిపాలన విధానం మారాలని అన్నారు. 75 ఏండ్లలో ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు పీఎంలు, సీఎంలు అయ్యారని, కానీ నేటికీ వ్యవసాయానికి సాగునీరు, ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. మహారాష్ట్రలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలని సూచించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పండించిన పంటకు మద్దతు ధర రాక, పెట్టుబడులు పెరిగి అప్పులు పెరుగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో, అసెంబ్లీల్లో గంభీర ప్రసంగాలు, ఉపన్యాసాలు దంచికొట్టే నాయకులు ఆత్మహత్యలను ఎందుకు నిలువరించడం లేదని ప్రశ్నించారు. దీన్ని రైతులు అర్థం చేసుకోవాలని, రైతులు ధర్మం పేర, రంగురంగుల పార్టీల జెండాల పేర, మతం పేర విడిపోకుండా ఐక్యమైతేనే దీనికి పరిష్కారం దొరుకుతుందని స్పష్టంచేశారు. దేశంలో రైతులు, రైతు కూలీల జనాభా 50 శాతం కన్నా ఎక్కువ ఉందని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదని అన్నారు. ఎమర్జెన్సీ విధిస్తే జేపీ నారాయణ పిలుపుతో దేశమంతా ఒక్కటై అప్పటి మహామహా నేతలనే కూకటివేళ్లతో పెకిలించివేశారని గుర్తుచేశారు. అదే విధంగా.. రైతులు నాగళ్లే కాదు.. పెన్నులు పట్టి చట్టాలు చేసేలా మరోసారి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో సంపత్తికి కొదవ లేదని, కానీ అది ప్రజలకు చేరడం లేదని చెప్పారు. దేశంలో 50 శాతం వ్యవసాయాధిరిత భూమి ఉందని, కానీ సాగునీరు అందించలేకపోతున్నారని వాపోయారు. కేంద్ర గణంకాల ప్రకారం ప్రతియేటా 50 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే కేంద్రంలోని నేతలు తమాషా చూస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో కృష్ణ, గోదావరి, పెన్‌గంగ, మంజీరా, ఇంద్రావతి, ప్రాణహిత తదితర నదులు ప్రవహిస్తున్నా.. బొగ్గు నిక్షేపాలున్నా.. ఇక్కడి రైతులకు సాగు నీరు, కరెంటు లభించడం లేదని వాపోయారు. రిజర్వాయర్లు నిర్మించలేని కేంద్ర సర్కారు.. ట్రిబ్యునళ్ల పేరిట కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. ప్రధానికి రైతులంటే గౌరవం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. 13 నెలల పాటు దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు ధర్నా చేస్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదని, 750 మంది రైతులు చనిపోతే కనీసం ఆరా తీయరా అని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలు ఆగాలన్నా, తాగు, సాగునీరు లభించాలన్నా, నాణ్యమైన ఉచిత కరెంటు రావాలన్నా రైతు సర్కారుతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాలను వివరించారు. మహారాష్ట్రలోనూ తెలంగాణ పథకాలు అమలు కావాలంటే 'గులాబీ జెండా' ఎత్తాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో గులాబీ సర్కారును తీసుకొస్తే.. రెండేండ్లలో 24 గంటల పాటు ఉచిత నాణ్యమైన కరెంటు అందజేస్తామని చెప్పారు. ఈ బహిరంగ సభకు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మైనంపల్లి హన్మంతరావు తదితరులు హాజరయ్యారు.