Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్న రాష్ట్రాలకు అదనపు రుణాలివ్వబోమని కేంద్ర ప్రభుత్వం బలవంతపు ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాముక కమలాకర్, చీటీ భూపతిరావు తెలిపారు. ఈ మధ్యనే పాత పెన్షన్‌ను పునరుద్ధరించిన రాజస్తాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు జీఎస్డీపీ రుణాలను మూడు శాతానికి తగ్గించి ఉద్యోగుల హక్కులను హరించేలా ఒత్తిడి తేవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీలో ఉంచిన రాష్ట్ర, ఉద్యోగుల వాటాగా ఉన్న రూ.16వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయా రాష్ట్రాలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.వాటిని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఆ విధానం తగదు : ఎన్ఎంఓపీఎస్ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ
రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే రాష్ట్రాలకు అదనపు రుణాలిచ్చేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేయడాన్ని ఎన్ఎంఓపీఎస్ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ తప్పుబట్టారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ..ఉద్యోగుల సొమ్మును తనఖాపెట్టే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఉద్యోగుల సామాజిక భద్రత, సంక్షేమం కోరే రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయనీ, వాటికి ఆర్థికంగా సహకారం అందించాల్సింది పోయి ఆర్థిక ఆంక్షలు విధించడమేంటని నిలదీశారు. ఉద్యోగుల డబ్బులతో అదాని లాంటి కార్పొరేట్లు బిలినియర్లు అవుతున్నారనీ, ఈ జూదంలో సీపీఎస్ ఉద్యోగులు ఓడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని వృద్ధ తల్లిదండ్రుల బాగోగులను వదిలివేస్తే 'అదనపు వ్యక్తిగత రుణాల'ను ఇస్తామంటూ బ్యాంకులు కూడా ముందుకు వస్తాయేమో ..అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రం బెదిరింపు ధోరణి సరికాదనీ, ఆ సర్క్యూలర్‌ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూరకుల శ్రీనివాస్, మ్యానపవన్ కుమార్, లింగమూర్తి, బుచ్చన్న, దర్సన్ గౌడ్, మల్లికార్జున్, రోషన్, ఉపేందర్ పాల్గొన్నారు.