Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పల్ భగయాత్‌లో 38 ఎకరాల్లో 22 భవనాలు
నవతెలంగాణ బ్యూరో-హైరాబాద్
వెనుకబడిన వర్గాల చరిత్రలో ఆదివారం గొప్పగా గుర్తుండి పోతుందని రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో 13 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 75 ఏండ్ల స్వతంత్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా వెనకబడిన వర్గాలకు మేలు చేస్తున్నామని చెప్పారు. రాజధాని నడిబొడ్డున కోకాపేట, ఉప్పల్ బాగాయత్లో వేల కోట్ల విలువచేసే 87.3 ఎకరాలను ప్రభుత్వం వారికి కేటాయించిందన్నారు. ఉప్పల్ భగాయత్‌లో 13 కుల సంఘాలకు 18.3 ఎకరాల్లో రూ. 17 కోట్లతో నిర్మించే భవనాలకు భూమి పూజ చేశామని చెప్పారు.. ఇక్కడే మరో 22 కులాలకు 38 ఎకరాలు కేటాయించామని తెలిపారు. దసరా నాటికల్లా వీటిలో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని ఆయా సంఘాలకు సూచించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని అన్నారు. తెలంగాణ రావడంతోనే మన జీవితల్లో పెద్ద మార్పు వచ్చిందని చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కుల వ్యవస్థపై మహనీయులు ఫూలే అధ్బుత పరిశోధన చేశారని తెలిపారు. మనమంతా ఒకటేననీ, కేవలం వృత్తిపరంగా కులాలుగా విభజించబడ్డామని చెప్పారని అన్నారు. అందరినీ కలపడానికి ఆయన పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదని వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసుధనాచారి, ఎమ్మెల్యేలు భేతి సుభాష్ రెడ్డి, ముఠాగోపాల్, బీసీ కమిషన్ చైర్మెన్ వకుళాభరణం కష్ణమోహన్రావు, సాహిత్య అకాడమీ చైర్మెన్ గౌరీ శంకర్, బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, కిషోర్. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశంతో పాటు బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.