Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహారాష్ట్రలోని నాందేడ్‌లో 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా తిష్టవేసి పనిచేసినా బీఆర్ఎస్ నిర్వహించిన సభ జనం లేక తుస్సుమన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.500 చొప్పున ఇచ్చి తెలంగాణలోని సరిహద్దు జిల్లాల నుంచి ప్రజలను తీసుకెళ్లారని ఆరోపించారు. దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం ప్రాతినిధ్యం పెంచుతామని కేసీఆర్ చెప్పటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యల గురించి ఆయన మాట్లాడటం దయ్యాలు వేదాలను వల్లించినట్టుగా ఉందని విమర్శించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. అబద్దాలకు ఆస్కార్ అవార్డుంటే అది కేసీఆర్‌కే దక్కేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తొమ్మిదేండ్లలో ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయనే విషయాన్ని చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రయివేటు పరమైన సంస్థలన్నింటినీ ప్రభుత్వ పరం చేస్తానని చెప్పటం మరో పెద్ద జోక్ అన్నారు. ఫార్మా, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో మహారాష్ట్ర తెలంగాణను మించిపోయిందని తెలిపారు. 12 కోట్ల జనాభా ఉన్న మహారాష్ట్రలో లిక్కర్ ద్వారా ఆదాయం రూ.17వేల కోట్లు వస్తుంటే...నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో రూ.40 వేల కోట్ల ఆదాయం దాటిందని వివరించారు. దేశంలోనే తెలంగాణలో నిత్యావసర వస్తువుల రేట్లు, పెట్రోల్, డీజిల్ రేట్లు అధికంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉందని పేర్కొన్నారు.