Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి.ఎన్ రావు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
రాష్ట్ర ప్రభుత్వం వైద్య పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)ను భాగస్వామ్యం చేయాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బీఎన్ రావు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఐఎంఏలో దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారని, రాష్ట్రంలో 20వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ఐఎంఏ సామాజిక బాధ్యతతో ముందుంటుందన్నారు. పబ్లిక్ హెల్త్ సర్వీస్ సేవలను ప్రజలకు అందించేందుకు గ్రామాలను వైద్యులు దత్తత తీసుకొని వైద్యం అందించేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ వైద్యరంగంలో 70 శాతం ప్రయివేటు వారే సేవలందిస్తున్నారని చెప్పారు. ప్రజలకు సేవ అందించేందుకు ప్రయివేటు వైద్యులకూ ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి ఆస్పత్రులకు సైతం ఆరోగ్యశ్రీ సేవలను అనుమతించాలని కోరారు. రాష్ట్రంలో అక్కడక్కడ వైద్యులపై దాడులు జరగడం బాధాకరమని, దీన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఐఎంఏ మాట్లాడి రక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఐఎంఏ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు సంక్రమించే నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఆవ్ గావ్ చెలే పథకం కింద గ్రామాలను దత్తత తీసుకుంటున్నామని తెలిపారు. ఆస్పత్రి అనుమతి కోసం సింగల్ విండో సిస్టమ్, ఎస్టీపీ ఏర్పాటు, క్లినికల్ స్థాపన, చిన్న ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ అనుమతి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ బకాయిలను వెంటనే చెల్లించాలని లాంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఐఎంఏ జనరల్ సెక్రెటరీ డాక్టర్ విజరు రావు, కోశాధికారి డాక్టర్ రాజేందర్ కుమార్ యాదవ్, మాజీ అధ్యక్షులు డాక్టర్ ప్రతాపరెడ్డి, డాక్టర్ సంపత్ రావు, ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ గట్టు శ్రీనివాసులు, డాక్టర్ రంగారెడ్డి, డాక్టర్ లింగమూర్తి, డాక్టర్ నరేందర్ రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.