Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్
- కోర్టు ప్రొసీడింగ్స్ స్థానిక భాషల్లో ఉండే దిశగా చర్యలు
- పెండింగ్ కేసుల పరిష్కారానికి అందరూ సహకరించాలి
- 1013కేసులు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు బదలాయింపు
నవతెలంగాణ - ధర్మారం
న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సంరక్షించే దిశగా మనమంతా కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవానికి హాజరైన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, హై కోర్టు జడ్జీలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ, పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. సురేష్ బాబు స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో వాడే భాష స్థానిక ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఉంటే మరింత చేరువగా న్యాయ వ్యవస్థ పని చేయగలుగుతుందని సూచించారు. క్షేత్రస్థాయి న్యాయస్థానాల్లో స్థానిక భాష ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు, ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నదని తెలిపారు. నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఏర్పడటం చారిత్రాత్మిక అంశమని, దీనివల్ల ప్రజల సమీపంలో న్యాయం అందే అవకాశాలు మెరుగవుతాయన్నారు. జిల్లాలోని అన్ని కోర్టుల పరిధిలో 16,465 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి మౌలిక వసతుల మెరుగుదల, నూతన కోర్టుల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. న్యాయవ్యవస్థలో రూల్ ఆఫ్ లా అందరికీ సమానంగా అమలు కావాలని, సమాజంలోని ప్రతి పౌరునికి, వెనుకబడిన వర్గాల ప్రజలకు సమాంతరంగా న్యాయ సేవలు తప్పనిసరిగా అందాలన్నారు. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా మనమంతా సమిష్టిగా పనిచేయాలని, కోర్టులో న్యాయవాదులు, జడ్జిల ప్రవర్తన మార్గదర్శకాలు మేరకు మర్యాద పూర్వకంగా ఉండాలని సూచించారు. నంది మేడారంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని త్వరగా తయారు చేసేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్, అధికార యంత్రానికి ఆయన అభినందనలు తెలిపారు. హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావు మాట్లాడుతూ.. తన గ్రామంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎన్.వి. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి సాంకేతికతను వినియోగిస్తూ నూతన కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నంది మేడారంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పరిధికి 281సివిల్ కేసులు, 732 క్రిమినల్ కేసులు మొత్తం 1013 కేసులు బదిలీ చేసినట్టు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు జడ్జిలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో 14 మంది హై కోర్టు జడ్జీలతో పాటు పెద్దపల్లి ప్రిన్సిపాల్ జిల్లా సెషన్స్ జడ్జి ఎం.నాగరాజు, పెద్దపల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్. సురేష్ బాబు, సెక్రటరీ భాస్కర్,పాల్గొన్నారు.