Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా గొంతుక రేవంత్ రెడ్డి యాత్ర
- రాష్ట్రంలో 60 నియోజక వర్గాల్లో 'హాత్ సే హాత్'
- పోరాట వీరవనితలు సమ్మక్క - సారలమ్మ పోరాటగడ్డపై నుంచి ప్రారంభం
- టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, గాంధీభవన్ ఇన్చార్జ్ కిరణ్, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ- ములుగు
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని, ఇందులో భాగంగానే ప్రజాగొంతుకగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదివాసీ పోరాట వీరవనితల పోరుగడ్డ మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని రేవంత్ రెడ్డి 'హాత్ సే హాత్' యాత్రను ప్రారంభిస్తారని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క, గాంధీభవన్ ఇన్చార్జ్ చాపాతి కిరణ్, మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన ఏర్పాటు చేసిన 'హాత్ సే హాత్' యాత్ర సన్నాహక సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర స్ఫూర్తితో సమ్మక్క - సారలమ్మ సాక్షిగా రేవంత్ రెడ్డి 'హాత్ సే హాత్' పాదయాత్రకు పూనుకున్నారని తెలిపారు. ములుగు నియోజక వర్గం తాడ్వాయి మండలం మేడారం నుంచి మొదలు కాబోతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ, పంటకు గిట్టుబాటు ధర, ధరణి పోర్టల్ రద్దు, పోడు భూములకు పట్టాలు ఇస్తుందని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రజల సమస్యలను పక్కనపెట్టి కార్పొరేట్ సంస్థలకు కాపాడుతున్నారని తెలిపారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, పంట రుణమాఫీ ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఎరువులు, విత్తనాలపై సబ్సిడీలు ఎత్తివేసి నామమాత్రంగా ఎకరాకు రూ.5000 రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.60 వేల కోట్లు దారి మళ్లించి, కేవలం రూ.10 కోట్లతో దళిత బంధు అమలు చేసి దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
అనంతరం రేవంత్ రెడ్డి 'హాత్ సే హాత్' యాత్రపై పాటల సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి రెడ్డి, టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్ర సత్యనారాయణ రావు, టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్, టీపీసీసీ సభ్యులు మల్లాడి రాంరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, తదితరులు పాల్గొన్నారు.