Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు చేతులెత్తేశారా?
- బీఆర్ఎస్లో చేరాలంటూ 'పోడెం'పై ఒత్తిడే కారణమా?
- కీలక దశలో ఆయన కారెక్కితే కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే...
- రేవంత్ ముందే పసిగట్టి యాత్రను ములుగుకు మార్చారా?.. కాంగ్రెస్‌లో చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'హాత్ సే హాత్'యాత్రను భద్రాచలం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి ములుగు జిల్లా మేడారానికి ఎందుకు మార్చారు? ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఆయనకు సహకరించకుండా చేతులెత్తేశారా? అందుకు తగిన ఏర్పాట్లు చేయబోమంటూ భీష్మించుకు కూర్చున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల్లో ఇదే చర్చనీయాంశవుతున్నది. భద్రాచలం రామాలయం నుంచి ప్రారంభిస్తామన్న యాత్ర మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయానికి ఎందుకు మారింది అనేది ఆసక్తికరంగా మారింది. భద్రాచలం, ములుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. తగిన ఏర్పాట్లు చేస్తానంటూ ఎమ్మెల్యే పోడెం వీరయ్య హామీ కూడా ఇచ్చారు. ఇంతలోనే ఎందుకు కార్యస్థలం మారింది? పార్టీలో ఏం రాజకీయ పరిణామాలు జరిగాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జిల్లాకు చెందిన కీలక నేత, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శాసనసభ సమావేశాల్లో బిజీగా ఉండటంతో ఏర్పాట్లు చేసేందుకు సమయంలో లేకపోవడం వల్లే యాత్రను మేడారానికి మార్చారనే వాదన వినిపిస్తున్నది. ఈ విషయాన్ని పార్టీకి నేరుగా చెప్పకుండా ఏర్పాట్లు చేయకపోవడంతోనే రేవంత్ మేడారానికి మార్చుకున్నట్టు తెలిసింది. భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్యను పార్టీ మారాలంటూ బీఆర్ఎస్ గత కొంత కాలంగా ఆయనపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. తన సొంత నియోజకవర్గం ములుగులో టికెట్ ఇవ్వకుండా సీతక్కకు ఇవ్వడం, భద్రాచలంలో స్థానికేతరడు కావడంతో పార్టీపై ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన బీఆర్ఎస్...రానున్న ఎన్నికల్లో ములుగు నియోజకవర్గానికి బీఫామ్ ఇస్తామంటూ పోడెంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. అయితే బీఆర్ఎస్ ప్రతిపాదనను పోడెం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి, పార్టీ కీలక నేతలు మాత్రం బీఆర్ఎస్ వ్యూహాన్ని పసిగట్టినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. రేవంత్ హాత్ సే హాత్ యాత్ర భద్రాచలం నుంచి ప్రారంభమైన తర్వాత పోడెం వీరయ్య అనివార్య పరిస్థితుల్లో బీఆర్ఎస్లో చేరితే, పార్టీలో టీపీసీసీ చీఫ్ ప్రతిష్ట మాసకబారుతుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత తెలిపారు. రేవంత్ యాత్ర ములుగు నుంచి ప్రారంభించడం ఎలా ఉన్నా...ఈ పరిణామాలతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు సజీవంగా ఉన్నాయనే విషయం మరోసారి తెరపైకి వచ్చింది. మరోవైపు ఇప్పటికే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో హాత్ సే హాత్ అభియాన్ యాత్ర అన్ని జిల్లాల్లో కొనసాగించాలనే ఏఐసీసీ నిర్ణయాన్ని అమలు చేయకతప్పని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా కాలంగా రేవంత్ పాదయాత్రపై ఏఐసీసీ క్లారిటీ ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రానికి చెందిన కొంత మంది నేతలు కూడా పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక్కరే యాత్ర చేస్తే ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందనీ, అందరికీ పాదయాత్ర చేసే అవకాశం ఇవ్వాలని సీనియర్లు కోరుతున్నట్టు తెలిసింది.