Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2.80 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు...?
- ముహూర్తం నేటి ఉదయం 10.30 గంటలు
- శాసనసభలో హరీశ్‌రావు.. మండలిలో వేముల...
- నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదన
- ఎన్నికల ఏడాది కావటంతో సర్వత్రా ఆసక్తి
- నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లకు ప్రాధాన్యత దక్కేనా..?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క...' అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నది. ఇది ఎన్నికల సంవత్సరం కావటమే అందుకు కారణం. షెడ్యూల్ ప్రకారం ఈ యేడాది నవంబరు లేదా డిసెంబరులో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీఆర్ఎస్ సర్కారు సోమవారం ప్రవేశ పెట్టబోయేదే చివరి బడ్జెట్. అందువల్ల ఇది పూర్తిగా ఎలక్షన్ల కోణంలోనే ఉండబోతోందని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి భారీ పద్దునే ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. గతేడాది (2022-23) రూ.2,56,958 కోట్లతో పద్దును ప్రతిపాదించిన సర్కారు... ఇప్పుడు అంతకు మించి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని సమాచారం. ఆ రీత్యా చూసినప్పుడు రూ.2.80 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకూ పద్దు పెరిగే అవకాశముంది. అయితే ఈసారైనా నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, కేజీ టూ పీజీ తదితర ప్రాధాన్యతాంశాలకు బడ్జెట్లో పెద్ద పీట వేస్తారా..? లేదా..? అనేది చూడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సాగునీటి పారుదల, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, తెలంగాణకు హరితహారం తదితరాంశాలకు ఎప్పటి మాదిరిగానే అధిక కేటాయింపులు ఉండబోతున్నాయి. వాటితోపాటు రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, ఓఆర్ఆర్ తదితర నిర్మాణాలకు కూడా ఎక్కువ నిధులు దక్కేలా బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం. ఈ రకంగా రూపొందించిన పద్దును సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, శాసన మండలిలో సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే వారిద్దరికీ దిశా నిర్దేశం చేశారు.
మరోవైపు రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2023-24)కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఉదయం 10.29 గంటలకు ప్రారంభమైన రాష్ట్ర కేబినెట్ సుమారు 50 నిమిషాలపాటు కొనసాగింది. బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపింది. అనంతరం సీఎం... నాందేడ్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యాన తలపెట్టిన బహిరంగ సభకు బయల్దేరి వెళ్లారు.