Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాలి
- బీసీ పొలిటికల్ ఫ్రంట్ సమావేశంలో నాయకులు, మేధావులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కుల గణన చేపట్టాలనీ, బీసీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేయాలని పలు రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు డిమాండ్ చేశారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షులు ప్రొఫెసర్ కె.మురళీ మనోహర్ అధ్యక్షతన కుల గణన - బీసీ సబ్ ప్లాన్ -రాజకీయ పార్టీల వైఖరి అనే అంశంపై ఆదివారం హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల గణన హామీనిచ్చి అమలు చేయకుండా చోద్యం చూస్తోందని విమర్శించారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ను అమలు చేయకుండా మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్లోనూ బీసీలకు నామమాత్రపు కేటాయింపులే చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన చేపట్టాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
బీజేపీపై ఒత్తిడి పెంచాలి
అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు కుల గణన చేపట్టే విధంగా బీజేపీ పెంచాలనీ, అందుకనుగుణంగా ఒత్తిడి పెంచేలా ఉద్యమాలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మేకపోతుల వెంకట రమణ సూచించారు. కుల గణన చేపట్టడం, బీసీ సబ్ ప్లాన్ చేయాలనే డిమాండ్లను తమ పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుందని స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో కులగణన చేపట్టాలంటూ సీపీఐ(ఎం) సభ్యులు పార్లమెంటులో డిమాండ్ చేశారని గుర్తుచేశారు. 2011లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కులగణన చేయాలని డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని విమర్శించారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో ఆ ప్రభుత్వం కుంటి సాకులుచెప్పి కుల గణన చేపట్టలేమంటూ తప్పించుకుందని తెలిపారు గణన చేపడితే అసమానతలు బయటపడి కొత్త డిమాడ్లు ముందుకొస్తాయనీ, బీజేపీ అవలంభిస్తున్న మత ఎజెండాకు ఆటంకమవుతాయనే ఉద్దేశంతోనే మోడీ, నాయకులు ఆ పని చేయడం లేదని రమణ విమర్శించారు. రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాలని గత అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నప్ప టికీ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్పత్తి , సేవా వృత్తులు, సంచార జాతుల వారికి ఉపాధి కల్పించే విధంగా బడ్జెట్లో తగిన వాటా కల్పిం చాలని డిమాండ్ చేశారు. ఎంబీసీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేయాలని కోరారు.
బ్రిటీష్ గణాంకాలే ఆధారం
బ్రిటీష్ పాలనలో 1931లో చివరి సారి చేసిన గణాంకాలే బీసీలకు మిగిలాయని కె.మురళీ మనోహర్ తెలిపారు. వాటి ఆధారంగానే నేటికీ మాట్లాడే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలంటే గణాంకాలు అవసరమని తెలిపారు.
అనేక కమిషన్లు సిఫారసు చేసినా....
కుల గణన చేపట్టాలంటూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనేక కమిషన్లు సిఫారసు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదని సమాజ్ వాదీ పార్టీ నేత ప్రొఫెసర్ సింహాద్రి విమర్శించారు.
ఆర్థిక వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి వ్యతిరేకంగా తమిళనాడు, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలు తీర్మానించాయని తెలిపారు.ఈ సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పీ.ఎల్.విశ్వేశ్వర్ రావు, బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదెగోని రవి సూచిచారు. బీయస్సీ - బీసీ రిజర్వేషన్ పోరాట స్టీరింగ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ సాంబశివగౌడ్ దేశగాని, ఆప్ మాజీ నేత ఇందిరాశోభన్, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు పిడికిలి రాజు, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌడ్ కిరణ్ కుమార్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి దేవల్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.