Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యకు ఎన్ఈపీ ఆటంకం
- సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యం : మాజీ ఎంపీ, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు
- ఘనంగా ప్రారంభమైన టీఏవీఎస్ రాష్ట్ర రెండో మహాసభలు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, ఆదిలాబాద్‌టౌన్
కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకురావడంతో విద్య వ్యాపారంగా మారిందని భద్రాచలం మాజీ ఎంపీ, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిడియం బాబురావు అన్నారు. మార్కెట్ శక్తులు విద్యారంగాన్ని శాసిస్తున్నాయని తెలిపారు. పాతకాలం నాటి చెత్తను తీసుకొచ్చి చొప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్అండ్బీ విశ్రాంతి భవనం ఎదుట ఆదివారం తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం(టీఏవీఎస్) రెండో మహాసభలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఆదివాసీ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయా జిల్లాల నుంచి విద్యార్థుల రాకతో స్థానిక ఆర్అండ్బీ విశ్రాంతి భవన పరిసర ప్రాంతం సందడిగా మారింది. ఈ సందర్భంగా జరిగిన సభలో మిడియం బాబురావు మాట్లాడుతూ.. దేశమంతా కోవిడ్‌తో ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇదే సమయంలో నూతన విద్యా విధానం(ఎన్ఈపీ-2020)ని తీసుకొచ్చిందని తెలిపారు. ఈ విధానంలో మూడు రకాల భావనలు చొప్పించిందని చెప్పారు. ఏ స్థాయిలో చదువుకుంటే అదే స్థాయిలో నైపుణ్య సర్టిఫికేట్ ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారని పలు ఉదాహరణలిచ్చారు. ప్రాథమిక విద్యలో స్థానిక తెగల భాషలు లేకుండా పోతున్నాయని, హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విజ్ఞానవంతమైన చదువు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధాలు అమ్మితే వచ్చేలాభాలు ప్రస్తుతం విద్యారంగంలో వస్తున్నాయన్నారు. మత భావనలతో విద్యా విధానాన్ని నింపే పరిస్థితి వచ్చిందని వివరించారు. ఆదివాసీ బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ నూతన విధానం ఆటంకంగా మారుతుందని స్పష్టం చేశారు. హస్టల్లో కోడిగుడ్డును కూడా పెట్టకుండా మెనూను సైతం లాగేసే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యను నిర్వీర్యం చేస్తోందని, ఫెలోషిప్‌లో కోత విధించడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఏదైనా చట్టం ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుందని చెప్పారు. ఆదివాసీ విద్యార్థులకు టీఏవీఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని, పోరాటంతోనే సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, టీఏవీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మెస్రం రాజు, పూసం సచిన్, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడసం భీంరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, సరియం కోటేశ్వర్రావు, లంక రాఘవులు, టీఏవీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్రం ఈశ్వర్, బైరి సోమేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, నాయకులు ఆత్రం తానూష్, మెస్రం నర్మద, కోట్నాక్ పుష్పలత, మాలశ్రీ, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్‌రెడ్డి ఆదివాసీ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.