Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో మార్పు జరగాల్సిందే
- మోడీ పాలనలో లాభాలు ప్రయివేటుకు.. నష్టాలు ప్రజలకు..
- అదానీ లాభాల కోసమే బొగ్గు దిగుమతి
- మోడీ మిత్రుల కోసం విదేశీ కంపెనీలకు మోకాలడ్డు
- ఎల్ఐసీని పూర్తిగా ప్రభుత్వపరం చేస్తాం
- విభజిత, విద్వేష రాజకీయాలను వ్యతిరేకిస్తాం : నాందేడ్ ప్రెస్మీట్లో కేసీఆర్ వెల్లడి
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో పేదరికం నిర్మూలించాలంటే ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు జరగాలని సీఎం కేసీఆర్ వెల్లడించారు. చైనా, సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా మాదిరిగా చేయాలని అన్నారు. ప్రస్తుతం దేశంలో పన్నుల పేర పేదల నుంచి లాగడం, పెద్దలకు పంచడం చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ తన మిత్రుల వ్యాపారం కోసం విదేశీ కంపెనీలను దేశానికి రాకుండా మోకాలడ్డుతున్నారని విమర్శించారు. అదానీ వ్యవహరంపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విద్యుత్తు రంగాన్ని జాతీయం చేస్తామని, ఎల్ఐసీని పూర్తిగా ప్రభుత్వపరం చేస్తామని అన్నారు. మోడీ పాలనలో నష్టాల ప్రజలకు, లాభాలు ప్రయివేటువాళ్లకు వెళ్తున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఆదివారం బీఆర్ఎస్ బహిరంగ సభ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో బీఆర్ఎస్ ఏ విధానం ఉండబోతుందో ప్రకటించారు. ప్రస్తుతం దేశం అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఈ స్థితిలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామని కేంద్ర నేతలు ప్రకటించడం బూటకమని కొట్టిపారేశారు. దేశంలో ప్రధాని దందా నడుస్తోందని విమర్శించారు. దేశంలో ఉన్న బొగ్గు నిల్వలతో 125 యేండ్ల పాటు యావత్ దేశానికి విద్యుత్తు అందించవచ్చన్నారు. దేశ అభివృద్ధికి విద్యుత్తు రంగం కీలకమని, కానీ కుంటిసాకులతో ఈ రంగాన్ని ప్రయివేటుపరం చేస్తున్నారని వాపోయారు. విద్యుత్తు రంగం పూర్తిగా ప్రయివేట్వాళ్ల చేతికి వెళ్తే.. భవిష్యత్తులో దేశాన్ని, సర్కారును బ్లాక్మెయిల్ చేస్తారని హెచ్చరించారు. లక్షల కోట్ల ఆస్తిని కేవలం వందల కోట్లకు ప్రయివేటుపరం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పవన్ హన్స్ కంపెనీని ఉదహరించారు. ఈ కంపెనీతో ప్రభుత్వానికి దక్కే డివిడెంట్ కంటే తక్కువకు ప్రయివేటీకరణ చేశారని అన్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రయివేటీకరణ చేస్తే ఊరుకోబోమని, 2024 తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ జాతీయం చేస్తామని అన్నారు. బొగ్గు రంగంలోనూ ఇదే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. దేశంలో పెద్దఎత్తున బొగ్గు నిక్షేపాలున్నాయని, కిలో బొగ్గు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ ప్రధాని మోడీ.. తన మిత్రుడు అదానీ కోసం రాష్ట్రాలను భయపెట్టి బలవంతంగా ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేయిస్తున్నారని వాపోయారు. కోల్ ఇండియా కంపెనీకి అవసరమైన రైలు పట్టాలను వేయడం లేదని విమర్శించారు. ఎల్ఐసీని నిర్వీర్యం చేస్తున్నారని, అదానీ కంపెనీల్లో రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెట్టించారని, పైగా నష్టం జరగలేదని బూటకపు ప్రకటనలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద కుంభకోణమని, ఒకవేళ నష్టం జరగకపోతే అదానీ వ్యవహరంపై పార్లమెంట్లో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. మోడీకి అదానీపై ఉన్న ప్రేమ.. ప్రజలపై ఉండాలని చురకలంటించారు.
మహిళలకు పార్లమెంట్లో, అసెంబ్లీ, కౌన్సిల్లో 35 శాతం ప్రాతినిథ్యం కల్పిస్తామని అన్నారు. దేశంలో రాజకీయ విధానం, ప్రభుత్వ పరిపాలన ఇలా అన్ని రంగాల్లో మార్పు జరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. మోడీ మిత్రుడు కాబట్టే అదానీ రెండేండ్లలో ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలోకి వచ్చారని అన్నారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసని, ఈ విషయాన్ని ఇంకా దాచలేరని అన్నారు. నీటి వివాదాలకు భాగస్వామ్య పక్షాలతో చర్చించి పరిష్కరిస్తే సరిపోతుందని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మహారాష్ట్రకు నీటి అవసరం ఉంటే ఎస్సారెస్సీ నుంచి కూడా లిఫ్ట్ చేసుకోవచ్చని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.