Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమం పట్ల నిర్లక్ష్యం తగదు : పలు ప్రజాసంఘాల విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి ఏటా ఆయా తరగతుల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ..వాటిని ఖర్చు చేయటంలో సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని పలు ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం శాసన సభలో ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రవేశ పెట్టిన 2023-24 బడ్జెట్‌పై పలు ప్రజాసంఘాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి.
60శాతం నిధులు ఖర్చు చేయటం లేదు..:కేవీపీఎస్
ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద గతేడాది రూ.33,907కోట్ల కేటాయించగా.. ఈ ఏడాది రూ. 36,750 కోట్లు కేటాయించారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు జాన్‌వెస్లీ, టి స్కైలాబ్‌బాబు తెలిపారు. దళిత సంక్షేమానికి 2022-2023లో రూ.31,770కోట్ల కేటాయించగా ఈ ఏడాది రూ.34,475 కోటు ్లకేటాయిం చారని పేర్కొన్నారు. ఈ మొత్తం కేటాయింపుల్లో 60 శాతం కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. కేటాయించిన నిధుల్ని ఖర్చు చేయకుండా దళిత సాధికారత ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దళిత బంధు కోసం గతేడాది కేటాయించిన రూ.17,700కోట్లు ఖర్చు చేయలేదనీ, ఈ ఏడాది కూడా రూ.17,700 కేటాయింపులు చూపారనీ, నియోజకవర్గానికి 1100మందికి దళిత బంధు ఇస్తామన్నారనీ, ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వికలాంగుల సంక్షేమంపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం:ఎన్పీఆర్డీ
వికలాంగుల సంక్షేమం పట్ల సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పీఆర్డీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య విమర్శించారు. 2016 ఆర్పీడీ చట్టం ప్రకారం రూ.10,584.25 కోట్లు కేటాయించాలని గుర్తు చేశారు. ( ఐదు శాతం ప్రకారం) గతేడాది రూ. 89 కోట్లు మాత్రమే కేటాయించిందనీ, ప్రస్తుత బడ్జెట్లో మొండి చేయి చూపారని ఆందోళన వ్యక్తం చేశారు. మానసిక వికలా ంగుల సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో బడ్జెట్ ప్రసంగంలో లేదని పేర్కొన్నారు. వికలాంగుల వివాహ ప్రోత్సాహకం, స్వయం ఉపాధి రుణాలకు, పరికరాల కోసం నిధులు కేటాయించలేదని తెలిపారు. వికలాంగుల సంక్షేమ శాఖలో ఉద్యోగ నియామకాల గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
గీత కార్మికులకేది భరోసా..? : టీజీకేఎస్
గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామనీ, టాడి కార్పొరేషన్ కోసం రూ. గతేడాది రూ.30 కోట్లు కేటాయించి, ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తెలంగాణ గీత కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్న గీత వృత్తిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్య బడ్జెట్ గణనీయం..: డాక్టర్ సునీల్‌కుమార్
రాష్ట్ర బడ్జెట్లో ఆరోగ్య బడ్జెట్‌ను గణనీయంగా పెంచారని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల శస్త్ర విభాగాధిపతి డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. బడ్జెట్లో 4.18శాతం కేటాయిస్తూ మంత్రి న్విహించిన నెలవారి సమీక్షలో తేలిన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వైద్య ఆరోగ్య రంగానికి న్యాయం జరగలే..
టీయుఎంహెచ్యు
రాష్ట్ర బడ్జెట్లో వైద్యారోగ్య రంగానికి తగిన న్యాయం జరగలేదని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్యూ) గౌరవాధ్యక్షులు భూపాల్,రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ ఫసియుద్ధీన్, కె యాదానాయక్ తెలిపారు. కనీసం పది శాతం కేటాయించాల్సి ఉండగా కేవలం 4.18 శాతం మాత్రమే కేటాయించటం శోచనీయమన్నారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పెంచేందుకు నిధులు పెంచలే.. హెచ్ఆర్డీఏ
జనాభాకు తగినట్టుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పెంచేందుకు ఆరోగ్య బడ్జెట్లో నిధులు కేటాయించలేదని హెల్త్ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్(హెచ్ఆర్డీఏ) అధ్యక్షులు డాక్టర్ కె మహేశ్‌కుమార్ విమర్శించారు.
చేతి వృత్తిదారులకు చేయూత లేదు..
వృత్తిదారుల సంఘం
చేతి వృత్తిదారులకు చేయూతనందించాల్సిన కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు నామమాత్రంగా కేటాయింపులు చేయటం శోచనీయమని వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ పేర్కొన్నారు. బీసీ సంక్షేమానికి రూ. 6,229 కోట్లు కేటాయించారనీ, విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర వాటికి వాటిని ఖర్చు చేస్తే.. కార్పొరేషన్లు, ఫెడరేషన్ల సంగతేంటని ప్రశ్నించారు. కల్లుగీత , రజక,నాయి బ్రాహ్మణ, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ, పూసల, బట్రాజ్, ఉప్పర, బోయ, కుమ్మరి, మేదర కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు 10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
సేవా వృత్తుల పట్ల వివక్ష..:రజక వృత్తిదారుల సంఘం
సేవా వృత్తులకు బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష కొనసాగుతున్నదని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నరేశ్, పి ఆశయ్య తెలిపారు. రజక,నాయి బ్రాహ్మణ వృత్తి దారులకు కేవలం ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. సంక్షేమాభివద్ధికి నిధుల కేటాయింపులు ప్రస్తావనే లేకపోవడం శోచనీయమన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ల ప్రస్తావన లేకపోవటం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు.
గిరిజన బంధు ఊసే లేదు..:టీజీఎస్
బడ్జెట్లో గిరిజన బంధును విస్మరించడం అన్యాయమని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్ విమర్శించారు. గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి ఏటా 29శాఖలు కలిపి గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి పద్దు కింద గతేడాది రూ.13,412 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 2023-24 లో 15,233 కోట్లు కేటాయించారని తెలిపారు. కేటాయింపులు పెరిగినట్టు కనపడినా నేరుగా గిరిజనులకు లబ్ధి జరిగే శాఖల్లో మాత్రం కేటాయింపులు తక్కువగా చూపారని తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి ఖర్చు చేసే గిరిజన సంక్షేమ శాఖకు మాత్రం కేవలం రూ.3,965 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు.
మైనారిటీల సబ్‌ప్లాన్ హామీ నిలబెట్టుకోవాలి..:ఆవాజ్
మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు రూ. 5వేల కోట్లకు పెంచాలనీ, సబ్ ప్లాన్ హామీ నిలబెట్టుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ.2,200 కోట్లు మాత్రమే కేటాయించడం విచారకరమని తెలిపారు. గత బడ్జెట్ లో కేటాయించిన రూ.1,702 కోట్లు పూర్తిగా ఖర్చు చేయలేదనీ, ఈ బడ్జెట్లో కేటాయింపులు పెద్దగా పెంచలేదని విమర్శించారు.
విద్యారంగం పట్ల నిర్లక్ష్యం తగదు..:ఎస్ఎఫ్ఐ
విద్యారంగానికి తగిన విధంగా కేటాయింపుల చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టి నాగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. 6.57శాతం మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నదని విమిర్శించారు. పాఠశాల విద్యాశాఖకు కేవలం 5.54 శాతం, ఉన్నత విద్యకు ఒక్క శాతం మాత్రమే కేటాయించటం శోచనీయమన్నారు.
సంతృప్తికరంగా నిధులు కేటాయించలేదు: టీఎస్‌యూటీఎఫ్
విద్యారంగానికి కేటాయించిన నిధులు సంతృప్తి కరంగా లేవని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి తెలిపారు. గత బడ్జెట్లో కేటాయింపులను ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేయటానికి ఈ నిధులు సరిపోవనీ, ఇంగ్లీషు మీడియం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులు, మౌలిక వసతుల కల్పనకోసం కేటాయింపులు లేవని గుర్తుచేశారు.
ఉపాధ్యాయులపై చిన్నచూపు..:టీఎస్టీసీఈఏ
ప్రయివేటు ఉపాధ్యాయ, అధ్యాపకులపై చిన్న చూపు తగదని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ తెలిపారు. విద్యాశాఖకు 6.57శాతం నిధులు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మధ్యాహ్నం భోజనం రేట్లపై ఆలోచన చేయాలని కోరారు.
ప్రాధాన్యతా రంగాన్ని విస్మరించటం తగదు:డీటీఎఫ్
ప్రాధాన్యతా రంగమైన విద్యారంగాన్ని మరోమారు బడ్జెట్లో ఆనవాయితిగా విస్మరించిందని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం సోమయ్య, టి లింగారెడ్డి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో దేశం ముందుందనీ, సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టించిందని చెబుతూ కీలకమైన విద్యారంగాన్ని విస్మరించటమేంటని ప్రశ్నించారు.
మన ఊరు మన బడిని మరిచిండ్రు:టీపీటీఎఫ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు మన బడిని మరిచిపోయిందని టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్‌కుమార్, ముత్యాల రవీందర్ తెలిపారు. ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమల్లోకి తెచ్చిన మన ఊరు మన బడి కోసం అదనపు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి..
పీడీఎస్‌యూ
బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, ఆజాద్ డిమాండ్ చేశారు. విద్యారంగం పట్ల ఇంత నిర్లక్షమేంటని మరో పీడీఎస్యూరాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం పరుశురాం, విజరుకన్నా ప్రశ్నించారు.
విద్యా,వైద్యం పట్ల నిర్లక్ష్యం తగదు:పౌర స్పందన వేదిక
రాష్ట్ర బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు ఆశించిన మేర కేటాయింపులు లేకపోవడం విచారకరమని పౌరస్పందన వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలుగుబెల్లి నర్సిరెడ్డి,ఎం రాదేశ్యాం ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో విద్యకు 24 శాతం, వైద్యానికి 12శాతం నిధులు కేటాయించాలని కోరు తూ తెలంగాణ పౌరస్పందన వేదిక ప్రజల సంతకాలతో కూ డిన వినతి పత్రాన్ని ఆర్థిక మంత్రికి అందజేశామనీ, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యారంగాన్ని విస్మరించింది..:ఏఐఎస్ఎఫ్
విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు. నిరుద్యోగ బృతి అమలుకు నోచుకోని బడ్జెట్‌గా మిగిలి పోయిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలిఉల్లాఖాద్రి, కె దర్మేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.
చరిత్రలో రికార్డు..:ప్రజారోగ్య సంచాలకులు
రాష్ట్ర బడ్జెట్లో చరిత్రలో రికార్డు స్థాయి కేటాయింపులు జరిగాయని ప్రజారోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.
నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం తగదు.:డీవైఎఫ్ఐ
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి పొందేవరకు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ బృతి ఇస్తామని చెప్పిందనీ, ఎనిమిదేండ్లు గడుస్తున్నా..హామీ అమలు నోచుకోలేదని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేశ్, అనగంటి వెంకటేశ్ విమర్శించారు. ఈ ఏడాది బడ్జెట్లోనైనా తగిన నిధులు కేటాయిస్తారని యువత ఆశగా ఎదురు చూసిందని వారిని మోసం చేయడం తగదని హితవు పలికారు.