Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ధర్మాసనం తీర్పు
- ప్రభుత్వ పిటిషన్ తిరస్కరణ
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆమోదిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. డివిజన్ బెంచ్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామనీ, అప్పటి వరకు తీర్పును సస్పెండ్ చేయాలన్న ప్రభుత్వ వినతిని తిరస్కరించింది. పిటిషన్ సాధారణమైనదే అయినా అందులోని అంశాలన్నీ క్రిమినల్ కేసుకు చెందినవేననీ, ఆ అంశాలపైనే సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసులో అప్పీల్ దాఖలుకు హైకోర్టు పరిధి కాదనీ, సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవాలని తీర్పులో స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు వెలువరించాక దానిపై హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్‌కు ఆస్కారమే లేదని తెలిపింది. అందుకే ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించడం లేదని వివరించింది. రిట్ అప్పీళ్లను ఆమోదించనందున కేసులో మెరిట్ అంశాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోవడం లేదని తెలిపింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై రిలీఫ్ కోరుతూ సమర్పించిన రాతపూర్వక వాదనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాకే తీర్పు చెబుతున్నట్టు వివరించింది. సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ విచారణ అంతా పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసుపైనేననీ, ఆ అప్పీల్ పరిధి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఉండదనీ, సుప్రీంకోర్టుకే ఉంటుందని రామ్ కృష్ణణ్ ఫౌజి కేసులో సుప్రీం తీర్పు చెప్పిందని గుర్తు చేసింది. ఆ తీర్పునకు లోబడే అప్పీళ్లను తిరస్కరిస్తున్నట్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీల డివిజన్ బెంచ్ సోమవారం తీర్పు చెప్పింది. చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందే నిందితులను దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందంటూ సింగిల్ జడ్జి తీర్పులో పేర్కొన్నారనీ, అందుకే పోలీస్ దర్యాప్తును రద్దు చేసి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారని గుర్తు చేశారు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తామంటూ అప్పటివరకు సీబీఐ విచారణపై స్టే ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. సీబీఐ ఈ కేసు విచారణకు స్వీకరించేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పు తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టకుండా డివిజన్ బెంచ్ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేసింది. దీంతో సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమమయ్యింది.
ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సిట్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇతరులు హైకోర్టులో జనవరి నాలుగో తేదీన అప్పీళ్లను దాఖలు చేశాయి. జనవరి 18 వరకు వాదనలు జరిగాయి. అదేనెల 30 వరకు రాతపూర్వక వాదనలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తీర్పు రిజర్వులో పెట్టిన హైకోర్టు సోమవారం కీలక తీర్పు చెప్పింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు డీవీ సీతారాంమూర్తి, ఎస్డీ సంజరు తివారీ, ఉదయ హొల్లా, జె ప్రభాకర్ ఇతరులు వాదించారు.
'పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 12 గంటల్లోనే దర్యాప్తు ఏకపక్షంగా జరిగిందంటూ బీజేపీ రిట్ దాఖలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీబీఐకి కేసును బదిలీ చేస్తే తమకు కూడా అలాంటి సందేహాలే వస్తాయి. సీబీఐ అవసరం లేదు. సిట్‌నే కొనసాగించాలి. పోలీసుల దర్యాప్తు ఏకపక్షంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదు. వాటికి ఆధారాలు కూడా చూపాలి. నిందితులు సిట్ దర్యాప్తును రద్దు చేయాలని క్రిమినల్ పిటిషన్ వేయలేదు. కాబట్టి హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దనే అప్పీల్ దాఖలు చేయవచ్చు'అని ప్రభుత్వం, సిట్ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసులు నమోదు చేసింది క్రిమినల్ కేసు కాబట్టి సింగిల్ జడ్జి సీబీఐ దర్యాప్తు ఉత్తర్వులపై అప్పీల్ హైకోర్టులో చేయరాదనీ, సుప్రీంకోర్టులో చేయాలన్న రామచంద్రభారతి ఇతర నిందితుల వాదనను ఆమోదిస్తూ తీర్పు చెప్పింది.