Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసు దర్యాప్తునకు సిద్ధమవుతున్న సీబీఐ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : దేశంలో సంచలనం రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి రాష్ట్ర హైకోర్టు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సిట్ ఉన్నతాధికారులు సోమవారం చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అంతకముందు ఈ కేసును దర్యాప్తు కోసం సీబీఐకి ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయించింది. అంతేగాక, తాము సుప్రీంకోర్టుకు వెళ్లడానికి గాను ఈ తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేయాలనే రాష్ట్ర అడ్వకేటు జనరల్ (ఏజీ) చేసుకున్న విజ్ఞప్తిని కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే తమ వైపు నుంచి ఎట్టి పరిస్థితిల్లోనూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు కాపీ రాగానే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారించడానికి గాను సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ దిశగా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడే సీబీఐ అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ.. సిట్ అధికారులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడంతో మిన్నకున్నారు. ఈ లోపల ఒకసారి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను తమకు సమర్పించాలని సిట్ అధికారులను కోరిన సీబీఐ అధికారులు దానికి సంబంధించిన లేఖను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాశారు. కాగా తాజాగా డివిజన్ బెంచ్ తమకు ఈ కేసును అప్పగించడంతో దర్యాప్తునకు అవసరమైన ఏర్పాట్లను సీబీఐ త్వరితగతిన చేసుకుంటున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి సీబీఐలో పొలిటికల్ లీడర్ల కేసును విచారించే సీబీఐ అధికారుల బృందం.. ఈ కేసునూ విచారించడానికి వచ్చే అవకాశాలున్నట్టు తెలిసింది.