Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నవతెలంగాణ- సిటీబ్యూరో
ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సీబీఐకి కేటాయిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, ఈ విషయంపై తాము సుప్రీం కోర్టుకెళ్తామని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో వారు మాట్లాడారు. కోర్టు తీర్పును గౌరవిస్తూనే హక్కుల కోసం పోరాడుతామన్నారు. కేంద్రంలోని పెద్దలు ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలతో దాడులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని విమర్శించారు.
రుణమాఫీ ప్రస్తావనేది?
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీ ప్రస్తావన లేదని, రైతులు బ్యాంకులకు పోతే రుణాలు ఇవ్వడం లేదు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. దేశంలోనే ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పడానికేనని కానీ ఉద్యోగులకు మొదటి వారంలో కూడా వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సెర్ఫ్, వీఓఏల వేతనాలు పెంచలేదు. పక్క రాష్ట్రంలో రూ.10 వేలు ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కేవలం వెయ్యి రూపాయలు ఇస్తున్నారు. అవి కూడా సకాలంలో చెల్లించడం లేదు. పిల్లలు పుట్టిన సంవత్సరం తరువాత కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. అంగాన్ వాడీ సెంటర్లలో కుళ్లిన కోడి గుడ్లు పెడుతున్నారు.
ఇది ప్రజా బడ్జెట్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త
దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం 86శాతం ఎక్కువగా ఉంది. జై జవాన్, జై కిసాన్ మాటను కేసీఆర్ నిజం చేస్తున్నారు. విద్యుత్, వ్యవసాయం, సాగునీటికి అధిక నిధులు కేటాయించారు. 'అబ్ కి బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతో కేసీఆర్ దేశాన్ని ఏకం చేస్తున్నారు. 'మన ఊరు- మన బడి'కి పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించారు.
బీఆర్ఎస్ సర్కార్..రాష్ట్ర హక్కులను అమ్మకానికి పెట్టబోతున్నది : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
ఏడు మండలాలు, సీలేరు హైడ్రో ప్రాజెక్టు విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి కేసీఆర్ సరెండర్ అయ్యారు. శ్రీరామ్‌సాగర్ బ్యాక్ వాటర్ విషయంలో మహారాష్ట్రకు అనుమతి ఇస్తామని అనడం, నీళ్లు, నిధులు, నియామకాల స్ఫూర్తికి విఘాతం. నీటిని ఆంధ్ర రాష్ట్రం తరలించుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. నదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారు. కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పోయింది. శ్రీరామ్‌సాగర్ నీరు మన హక్కు. ముఖ్యమంత్రి తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? నాందేడ్‌లో మైక్ ముందు ఏది పడితే అది మాట్లాడారు.
ప్రజల సమస్యలు గవర్నర్ ప్రసంగంలో రాలేదు
ఎమ్మెల్యే టి.జయప్రకాష్‌రెడ్డి
గవర్నర్ ప్రసంగంలో ప్రజల సమస్యలు రాలేదు. బడ్జెట్ పుస్తకం దొడ్డుగా ఉంది తప్ప అందులో ఏమీ లేదు. గుండె జబ్బులున్నవారిని ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్లు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కేవలం కంటి వెలుగుకే పరి మితం అయింది. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రస్తావన లేదు. ఆరోగ్యశ్రీ అమలు ఊసే లేదు. వీఆర్ఎలకు సంబంధించి ప్రస్తావన లేదు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు దిక్కులేదు. యాదగిరిగుట్టకు మెట్రో ట్రైన్ ప్రస్తావన లేదు.
ఇది లెక్కల అంకెల గారడీ
ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు
కేంద్రం నుంచి రూ.40వేల కోట్లు, పక్క రాష్ట్రం నుంచి రూ.17వేల కోట్లు రావాలని ఈ బడ్జెట్లో చెప్పడం అతిశయోక్తి. ఇవి వస్తాయో రావో తెలియదు. ఎన్నికల నేపథ్యంలో మెగా బడ్జెట్ అని చూపెట్టి ప్రజలను మభ్యపెట్టడం మాత్రమే.
కోతలే..చేతల్లేవ్
టీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానశ్వర్
కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సాంతం కోతలే తప్ప చేతల్లేవు. పథకాలు బోలెడు ఉన్నా, నిధుల్లేవనే సంగతిని గుర్తించాలి. మన వూరు-మన బడి పథకాన్ని దాతలకే పరిమితం చేయకుండా నిధులు కేటా యించాలి. 52 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో కేవలం 2 శాతం నిధులు ఇవ్వ ఓడం దారుణం. బడ్జెట్ అంకెలగారడిని తలపిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నిధులు కేటాయించి, ఖర్చు పెట్టడం లేదు.