Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు బడుల్లో ప్రీప్రైమరీని ప్రారంభించాలి
- పీహెచ్‌సీలను అభివృద్ధి చేస్తేనే ప్రజలకు మెరుగైన వైద్యం
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన రూ.19,051 (6.56 శాతం) కోట్ల నిధులు ఏమాత్రం సరిపోవని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. సోమవారం శాసనమండలిలోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ అయ్యాక ఇది నాలుగో బడ్జెట్అనీ, అన్నీ ఒకే తరహాలో ఉన్నాయని అన్నారు. ఇది వినూత్నంగా ఏమీ లేదన్నారు. గురుకులాలు, మెడికల్ విద్య, వ్యవసాయ విద్యకు కలిపినా పది శాతానికి మించి కేటాయించలేదని చెప్పారు. కొఠారి కమిషన్ సిఫారసుల ప్రకారం విద్యకు రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని సూచించారు. 24 శాతం నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. కానీ 6.56 శాతం నిధులే కేటాయించిందని అన్నారు. విశ్వవిద్యాల యాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదించిందని వివరించారు. ఓయూలో కొన్ని హాస్టళ్లు కూలిపోయే దశలో ఉన్నాయని చెప్పారు. ఈ నిధులు ఏమాత్రం సరిపోవని అన్నారు. గత బడ్జెట్ కన్నా అదనంగా 50 శాతం నిధులు కేటాయించాలని కోరారు. మన ఊరు మనబడి పథకానికి నిధుల కొరత ఉన్నందు వల్లే పనులు చురుగ్గా సాగటం లేదన్నారు. మొదటి విడతలో 3,123 స్కూళ్లు రూ.3,497 కోట్లతో ప్రారంభించినా ఇప్పటి వరకు 1,210 పాఠశాలల్లోనే పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగతా వాటికి బడ్జెట్ విడుదల చేసి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా 21 జిల్లాలు ఏర్పడినా డీఈవో పోస్టులు, 151 మండలాల్లో ఎంఈవో పోస్టులను మంజూరు చేయలేదన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య రంగానికి 12 శాతం నిధులు కేటాయించాలని కోరితే 4.1 శాతం ప్రతిపాదించిందని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ)ను అభివృద్ధి చేసి 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకుంటేనే పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని చెప్పారు. డీఈవో, ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సర్కారు బడుల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలని సూచించారు.
రైతాంగాన్ని ఓట్లడిగే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదు : జీవన్‌రెడ్డి
రాష్ట్రంలో రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం హామీనిచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి చెప్పారు. విడతల వారీగా అమలు చేస్తామంటూ ప్రకటించిందన్నారు. ఇది చివరి బడ్జెట్ అనీ, రూ.లక్షలోపు రుణమాఫీ చేస్తారంటూ రైతులంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇందులో ఆ ప్రస్తావన లేనందున రైతాంగాన్ని ఓట్లడిగే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. గిరిజన బంధు మాయమైందని చెప్పారు. పోడు భూముల పట్టాల గురించి ప్రస్తావన లేదన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని సూచించారు. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు కాదనీ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందనీ, అందులో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. కొన్ని నోటిఫికేషన్ల దశలో ఉన్నాయని వివరించారు. పాఠశాల విద్యలో 20 వేల ఉపాధ్యాయ ఖాళీలున్నాయని అన్నారు. నిరుద్యోగ భృతి రూ.3,016 ఈ బడ్జెట్లోనూ కేటాయించలేదని విమర్శించారు.
వ్యవసాయానికి పెద్దపీట : పల్లా
రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సాగునీటి రంగం, విద్యుత్‌కు అధికంగా నిధులు కేటాయించిందని వివరించారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించేలా ఈ బడ్జెట్ ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు చెప్పారు.