Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది పూర్తి చేస్తామని బడ్జెట్లో స్పష్టం
- సంవత్సరంలోపే కడతామని శంకుస్థాపన రోజున సీఎం హామీ
- ఏడేండ్లవుతున్నా పూర్తవని ఎత్తిపోతల పథకం
- ఇంకా వందలాది భూనిర్వాసితులకు అందని పరిహారం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సీతారామ ఎత్తిపోతల పథకం శరవేగంగా పూర్తి చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 8 లక్షల ఎకరాలకు పైగా సాగునీరందిస్తామని ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రస్తావించింది. అదీ ఈ ఏడాదిలోగానే పూర్తి చేయాలని లక్ష్యంగా పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడంతో పాటు ఎన్నెస్పీలో నీటి లభ్యత ఉండని సమయంలో ఆయకట్టును స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మాణం చేపట్టారు. దీన్ని పాలేరు జలశయానికి అనుసంధానం చేస్తామని బడ్జెట్లో భాగంగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఆరేండ్ల కిందట రూ.13,263 కోట్ల అంచనాతో సీతారామ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.8వేల కోట్లు వెచ్చించారు. 60శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా 40 శాతం పనులు మిగిలివున్నాయి. ఇంకా వందలాది మంది భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. కాళేశ్వరం తరహాలో రీపేమెంట్ పద్ధతిలో 45శాతం ప్రభుత్వ కార్పొరేషన్, 55శాతం బ్యాంకులు చెల్లించేలా ప్రతిపాదించారు.
ఏడేండ్లవుతున్నా ఎదురుచూపే..
2016 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ ప్రాజెక్టుకు టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నుంచి ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ వరకు 243.20 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ద్వారా నీరు సరఫరా చేస్తామని ప్రకటించారు. గొలుసుకట్టు చెరువులు ప్రాతిపదికగా ఈ పథకాన్ని చేపట్టారు. గోదావరి నీటిని ఎత్తిపోసేలా డిజైన్ చేశారు. 9,000 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రతి వానాకాలం సీజన్లో 70.40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మూడు జిల్లాల్లో 3,28,853 ఎకరాల నూతన ఆయకట్టు, 3,45,534 ఎకరాల నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణ చేసేలా ప్రతిపాదించారు. నాలుగు పంపుహౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతాంగానికి ఎకరానికి రూ.8 లక్షల నుంచి రూ.18లక్షల వరకు అవార్డు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ సమీపంలో ఉన్న నిర్వాసిత రైతులకు రూ.18లక్షల పరిహారంగా చెల్లించాలని నిర్ధారించారు. ఇంకా పలువురు రైతులకు ఈ పరిహారం అందలేదు. ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు 1,62,083 ఎకరాలు కాగా ఎన్నెస్పీ కెనాల్‌తో స్థిరీకరించే ఆయకట్టు 2,96,925 ఎకరాలు, మొత్తం 4,59,008 ఎకరాలకు జిల్లాలో నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కొత్త ఆయకట్టు 9,196 ఎకరాలు, స్థిరీకరించే ఆయకట్టు 5,674 ఎకరాలుగా మొత్తం 14,870 ఎకరాలుగా ప్రతిపాదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు పూర్తయిన పనులు ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో మాత్రం స్తబ్ధుగా కొనసాగుతున్నాయి.
ఈ ఏడాదిలో పూర్తవడం కష్టమే..!
బడ్జెట్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నట్టుగా ఈ ఏడాది సీతారామ ఎత్తిపోతల పథకం పనులు పూర్తవడం కష్టమేనని నీటిపారుదలశాఖ నిపుణులు చెబుతున్నారు. ఎంత శరవేగంగా పనులు చేపట్టినా ఈ ఏడాది ప్రాజెక్టు అందుబాటులోకి రాకపోవచ్చంటున్నారు. కొన్ని ప్యాకేజీల్లో పనులు ఇంకా ప్రారంభించనే లేదు. 13, 14 ప్యాకేజీల్లో పనులు మొదలు పెట్టలేదు. 15, 16 ప్యాకేజీల్లో అక్కడక్కడా మొదలయ్యాయి. ఈ ప్యాకేజీలో 250 మందికి పైగా రైతులకు చెందిన 1012 ఎకరాలకు రూ.150 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో అండర్ టన్నెల్ నిర్మాణం చేపట్టేందుకు ఇంజనీరింగ్ నిపుణులు సూచన చేశారు. ప్రస్తుతం ఈ ఫైల్ సీఎం కేసీఆర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. పరిహారం కోసం పలు సందర్భాల్లో నిర్వాసిత రైతులు రోడ్డెక్కారు. పూర్తిస్థాయిలో పరిహారం కూడా అందని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు ఏడాదిలో అందుబాటులోకి రావడం దాదాపు అసాధ్యమే. ఎంత శరవేగంగా పనులు చేపట్టినా ఏడాదికి పైనే సమయం పట్టే ఆస్కారం ఉంది. ప్రస్తుతం పనులు కొనసాగుతున్న తీరును బట్టి చూస్తే ఇంకో రెండు, మూడేండ్లయినా అందుబాటులోకి రాకపోవచ్చని ప్రభుత్వ యంత్రాంగం నుంచి వినిపిస్తున్న మాట.
పరిహారం చెల్లించాలి..
- కొప్పుల రామిరెడ్డి, బీరోలు నిర్వాసితుడు
సీతారామ ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారం ఎకరానికి రూ.18.50 లక్షలుగా నిర్ధారించారు. వాస్తవానికి ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఇవి ఏమాత్రం సరిపోవు. ఈ పరిహారం కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో నిర్వాసితులందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఏడాదిన్నర కిందట పరిహారం కోసం కలెక్టర్‌ను కలిస్తే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. పర్సంటేజీ తీసుకుని కొందరు రైతులకు పరిహారం ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. కొంతకాలంగా టన్నెల్ ప్రతిపాదన ముందుకు వచ్చింది. సొరంగం వస్తుందో.. రాదో తెలియదు. కానీ భూమి సేకరించి పరిహారం ఇవ్వకపోవడంతో మేము అవస్థలు పడుతున్నాం.