Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి నెలలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు : కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు
నవతెలంగాణ-అడిక్ మెట్
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రూపొందించిన మిషన్ భగీరథ పథకంలో దాదాపు 16 వేల మంది కాంట్రాక్టు కార్మికులు అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని, వారికి వెంటనే వేతనాలు పెంచాలని కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం.60, జీఓ నెం.11 వర్తింపజేయడం లేదని చెప్పింది. మంగళవారం కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద వేలాది మంది మిషన్ భగీరథ కార్మికులతో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పాలడుగు భాస్కర్, వంగూరు రాములు (సీఐటీయూ), నరసింహ, బి.చంద్రయ్య, పల్లా దేవేందర్ రెడ్డి (ఏటీటీయూసీ), మద్దెల రవి, జె.బాబురావు (బి.ఆర్ఎస్.కె.వి), కె.సూర్యం, కిరణ్ (ఐ.ఎఫ్.టి.యు) మాట్లాడారు. మెగా కన్స్ట్రక్షన్, ఎల్అండ్టీ లాంటి బడా సంస్థల కాంట్రాక్టర్లు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించే సమయంలో కొన్ని పెద్ద సంస్థలకు బాధ్యతలు అప్పజెప్పిందని, ఈ సమయంలో కార్మికులకు ఆయా సంస్థలే వేతనాలు చెల్లిస్తున్నాయని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వహణ నిమిత్తం ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్న సంస్థలు కార్మికులకు మాత్రం తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో పని చేసే కార్మికుల స్థితిగతులను పట్టించుకునేందుకు మంత్రులకు ఎవరికీ బాధ్యతలు లేకపోవటంతో ముఖ్యమంత్రే స్వయంగా చూడటం వల్ల.. ఆయనకు సమస్యలను వివరించే అవకాశం రావడం లేదని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణ, వాటి నిర్వహణ బాధ్యతలను బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పడంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కార్మికుల విషయమై సంబంధిత అధికారులను ఎన్ని పర్యాయాలు అడిగినా సమస్యలు పరిష్కారం కానందున ఈ ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేలు, ఈఎస్ఐ, పీఎఫ్, పండుగ, జాతీయ, ఆర్జిత సెలవులు, లైన్ పెట్రోల్ అలవెన్స్, ద్విచక్ర వాహనాల అందజేయడం.. రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలన్న డిమాండ్లపై వెంటనే స్పందించి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే మార్చి నెలలో 48 గంటల నిరవధిక సమ్మె, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు రాము, మహేష్, కుమార్, శ్రీనివాస్, బుట్టో తదితరులు పాల్గొన్నారు.