Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కారుకు రాఘవులు ప్రశ్న
- కేంద్రం దిగొచ్చి జేపీసీ వేయాలి
- దళితులు, వెనుకబడిన తరగతులను మోసం చేసేలా మోహన్ భగవత్ వ్యాఖ్యలు
- త్రిపురలో ఈసీ స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
- మోడీ పాలనలో ఉపాధి హామీ నిర్వీర్యం : విజయరాఘవన్
- త్వరలో పొత్తులపై నిర్ణయం : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
అదానీ పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాల గురించి ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయనీ, చర్చ చేపట్టాల్సిందేనంటూ రెండురోజులుగా పార్లమెంటును స్థంభింపజేశాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు చెప్పారు. కానీ కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. చర్చ చేపట్టేందుకు భయమెందుకని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. దేశ ప్రజల సొమ్మును అదానీ సంస్థ కాజే స్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అదానీపై కుట్ర జరుగుతున్నదనీ, అక్రమాల్లేవంటూ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా విదేశీ శక్తులు చేస్తున్న కుట్ర అంటూ ఆర్ఎస్ఎస్ నాయకులంటున్నారని చెప్పారు. అది కుట్రా, కాదా?అన్నది పార్లమెంటులో చర్చిం చాలన్నారు. ఆ కుట్రలను ప్రభుత్వమే బట్టబయలు చేయా లనీ, కానీ చర్చించకుండా పార్లమెంటును ఎందుకు నిరోధి స్తున్నదనీ ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నట్టుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని కోరారు. న్యాయవ్యవస్థ ఆధ్వర్యం లో ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో రెండురోజులపాటు జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశాలు మంగళ వారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో రాఘవులుతోపాటు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పాల్గొన్నారు. ముందుగా రాఘవులు మీడియాతో మాట్లాడుతూ అదానీకి రూ.80 వేల కోట్లు ఎల్ఐసీ, రూ.25 వేల కోట్లు ఎస్బీఐ రుణం ఇచ్చింద న్నారు. అవి మునిగిపోయినా, చెల్లించకపోయినా పర్వా లేదంటూ కేంద్రం భావిస్తున్నదని చెప్పారు. ప్రజల సొమ్ముకు గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్చించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చర్చకు, విచారణకు, సమాధానానికి కేంద్రం సిద్ధంగా లేకపోవడం అన్యాయం, అప్రజాస్వామికమని విమర్శించారు. కేంద్రం దిగొచ్చి తగు చర్యలు చేపట్టాలని కోరారు. కులవ్యవస్థ, అంటరానితనానికి కారణం పండితులు (పూజారులు) అంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. శ్రమ గౌరవాన్ని పెంచాలనీ, అది లేకుండా పోతున్నదంటూ ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. దేశంలో కులవ్యవస్థ మూలంగా శ్రమకు గౌరవం లేదని తామూ అంగీకరిస్తామన్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారనీ, కులవ్యవస్థకు కారణం పూజారులు కాదనీ, మేధావులంటూ ఆర్ఎస్ఎస్కు చెందిన మరో ప్రతినిధి వ్యాఖ్యానించారనీ వివరించారు. మోహన్ భగవత్, హేడ్గేవార్, గోల్వాల్కర్ వంటి మేధావులు కారణమా?అని ప్రశ్నించారు. కులవ్యవస్థను కాపాడాలని చెప్పే మనుధర్మం రాసిన వారు కారణమా?అని అడిగారు. ఇవన్నీ వదిలేసి కొందరు వ్యక్తులపై నెట్టివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది కుల వ్యవస్థను కాపాడుకోవాలనే పద్ధతి తప్ప మరొకటి కాదన్నారు. దళితులు, ఇతర వెనుకబడిన కులాలను మోసం చేసే ప్రయత్నం ఇందులో ఉందని చెప్పారు. కులవ్యవస్థ పోతేనే శ్రమకు గౌరవం వస్తుంద న్నారు. దాన్ని నిర్మూలించకుండా మభ్యపెట్టే మాటలను విరమించుకోవాలని ఆర్ఎస్ఎస్ నేతలను కోరారు. ఈనెల 16న త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయనీ, అయితే అక్కడ శాంతియుత పరిస్థితుల్లేవని ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) కార్యాలయాలు, ఇండ్లు, దుకాణాలు, చేపల చెరువులపై బీజేపీ గూండాలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయని అన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు ఈసీ చర్యలు చేపట్టాలని కోరారు.
కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం : విజయ రాఘవన్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాల ను అవలంభిస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ విజయరాఘవన్ విమర్శించారు. ప్రజాస్వామ్యం, లౌకి కత్వం పరిరక్షణకు ప్రజాపోరాటాలను నిర్మిస్తామని చెప్పా రు. మోడీ పాలనలో సామాన్యుల జీవన స్థితిగతులు దుర్బరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. దేశంలో ద్రవ్యో ల్బణం పెరిగిందనీ, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశా న్నంటాయని వివరించారు. ధరల తగ్గింపునకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. నిరుద్యోగం తీవ్రంగా ఉందన్నారు. ఉద్యోగాల కల్పన కోసం ఎలాంటి చర్యల్లేవని అన్నారు. దేశంలో 23 కోట్ల మంది పేదరికంలో ఉన్నారని వివరించారు. అసమానతలు పెరిగిపోతున్నా యని చెప్పారు. ఉపాధి హామీ పథకానికి గతేడాది కంటే నిధులు తగ్గించిందని అన్నారు. ఎక్కువ నిధులు కేటా యించి ఉపాధి హామీని పటిష్టం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంకోవైపు మతతత్వ విధానాలతో ప్రజలను విభజిస్తున్నదని విమర్శించారు. కార్పొరేట్ అనుకూల విధానాలను అవలం భిస్తున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యం, లౌకికత్వం ప్రమాదం లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ మతోన్మాద కుట్రలను
ప్రజల్లోకి తీసుకెళ్తాం : తమ్మినేని
రాష్ట్ర ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కేటాయింపులు చేస్తున్నా వాటిని పూర్తి స్థాయిలో ఖర్చు చేయకపోవడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, వృత్తి దారులు, పేదల సంక్షేమానికి మరిన్ని నిధులు అవసరమని సూచించారు. అందుకనుగుణంగా బడ్జెట్ తుదిరూపం ఇచ్చేటపుడు మార్చాలని కోరారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాస్తామన్నారు. ఎన్నికలప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ బీఆర్ఎస్ నాయకులు సీపీఐ, సీపీఐ(ఎం) తమతోనే ఉంటాయనీ, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది లేదు, ఒకటి లేదా రెండు ఎమ్మెల్సీలు కేటాయిస్తామంటూ ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. కొందరు మంత్రులు కూడా మాట్లాడుతు న్నారని చెప్పారు. ఇది బీఆర్ఎస్ అధిష్టానానికి తెలిసే జరుగుతుందని తాము అనుకోవడం లేదన్నారు. గతంలో పొత్తులు ఖరారైనపుడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వని దాఖలాలు ఎప్పుడూ లేదని వివరించారు. త్వరలోనే సీపీఐతో పొత్తుల పై చర్చిస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తామనీ, ఆ పార్టీని ఓడిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామన్నారు.
అంతమాత్రాన బీఆర్ఎస్తో పొత్తు ఉంటుం దని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. సమస్యల మీద పోరాడ తామని చెప్పారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడి స్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ కార్యక్రమాలు జుగుప్సాక రంగా ఉన్నాయని విమర్శించారు. చేరికల కోసం ఓ విభాగం ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు, నాయకులను లొంగదీసు కునేందుకు ఈడీ, సీబీఐని కేంద్రం వాడుకుంటున్నదని అన్నారు. బీజేపీ ఎదుగుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామన్నారు. మతోన్మాద కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. మార్చిలో రాష్ట్రస్థాయిలో ప్రతి మండలం, జిల్లాలోని ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణను ప్రకటిస్తామని వివరించారు. బీజేపీ బూచి అని అన్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తారా?అన్న ప్రశ్నకు 'ముందు రాష్ట్రస్థాయిలో చూద్దాం. ఆ తర్వాత దేశం గురించి ఆలోచిద్దాం'అంటూ రాఘవులు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.